Nepal Rescue Operation | పది రోజులుగా సొరంగంలోనే.. అద్భుతరీతిలో ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ బాధితులు

భారీ విపత్తు జరిగి పది రోజులు గడుస్తున్నా, నేపాల్‌లో సహాయక బృందాల అన్వేషణలో అద్భుతాలు జరుగుతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nepal Rescue Operation | భారీ విపత్తు జరిగి పది రోజులు గడుస్తున్నా, నేపాల్‌లో సహాయక బృందాల అన్వేషణలో అద్భుతాలు జరుగుతున్నాయి. బురద, శిథిలాలు, కూలిపోయిన కట్టడాల మధ్య చావుబతుకుల కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని రెస్క్యూ టీమ్స్ సజీవంగా కాపాడాయి. తాజాగా జరిగిన ఈ రక్షణ చర్యలతో పది రోజులుగా ప్రాణాలతో బయటపడిన వారి సంఖ్య నలుగురికి చేరింది. దేశ చరిత్రలోనే అత్యంత భీకరమైన ఈ విపత్తులో భూగర్భంలో చిక్కుకున్న ఒక చైనా కార్మికుడిని, అలాగే దెబ్బతిన్న ఇంట్లో కూరుకుపోయిన 64 ఏళ్ల వృద్ధురాలిను రక్షకులు సురక్షితంగా వెలికితీశారు.

Nepal Rescue Operation | చైనా కార్మికుడు సేవ్..

త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఒక చైనా జాతీయుడిని అధికారులు శనివారం ప్రాణాలతో కాపాడారు. శుక్రవారం ఇదే ప్లాంట్‌లోని టన్నెల్ నుంచి ఇద్దరు నేపాల్ కార్మికులను రక్షించగా, తాజా ఘటనతో ఇక్కడ మూడో విజయవంతమైన రక్షణ చర్య నమోదైంది. నేపాల్ సైన్యం, దక్షిణ కొరియా విపత్తు నిర్వహణ నిపుణులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 225 మీటర్ల పొడవైన సొరంగం లోపల నుంచి లుహైతావో అనే కార్మికుడిని బయటకు తీశారు. తీవ్ర అలసటతో ఉన్నప్పటికీ స్పృహలోనే ఉన్న అతనికి హెలికాప్టర్‌లోనే సైనిక వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.

Nepal Rescue Operation |  64 ఏళ్ల వృద్ధురాలు రక్షణ..

మరో ఘటనలో, నువాకోట్ పట్టణంలో కూలిపోయిన ఇంట్లో ఇరుక్కుపోయిన 64 ఏళ్ల చండికా శ్రేష్ఠను రక్షకులు సజీవంగా వెలికితీశారు. ఆమెను దుప్పటిలో చుట్టి సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన దృశ్యాలు కనిపించాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను వెంటనే కాఠ్మండుకు విమానంలో తరలించారు.

Nepal Rescue Operation | కొనసాగుతున్న సహాయక చర్యలు..

నేపాల్‌లోని 12 జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 900 మంది కార్మికులు గల్లంతు కాగా.. వారిలో సుమారు 500 మంది వివిధ సొరంగాల్లోనే చిక్కుపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 26న హిమానీనదం కూలిపోవడం వల్ల సంభవించిన ఈ వినాశకరమైన వరదల్లో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మృతి చెందారు. మరో 5,000 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.

Nepal Rescue Operation | డీఎన్ఏ నమూనాలు సేకరించి..

ప్రభావిత ప్రాంతాల్లోని మూసుకుపోయిన సొరంగాల్లో ప్రాణాలతో ఉన్నవారి కోసం భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల నిపుణులు కూడా నేపాల్ బలగాలతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలు కుళ్లిపోకుండా డీఎన్ఏ నమూనాలు సేకరించి, ఇప్పటివరకు 1,030 మృతదేహాలను సామూహిక సమాధుల్లో అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న వేలాది మంది నిరాశ్రయులకు సురక్షితమైన వసతి కల్పిస్తామని, బాధితులు తమ జీవితాలను మళ్లీ నిలబెట్టుకునేలా ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని ప్రధాని బాలేంద్ర షా భరోసా ఇచ్చారు.

ఇది కూడా చదవండి:  KTR | రాష్ట్రానికో రంగు మారుస్తున్న రాహుల్ గాంధీ : కేటీఆర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *