అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Comments | కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి సృష్టించిన కరువని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో దుబ్బాక నియోజకవర్గ రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలెంల శ్రీలత రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Harish Rao Comments | రైతాంగం ఆగమవుతోంది..
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు ఆరోపించారు. “దుకాణంలో లేని యూరియా యాప్‌లోకి ఎలా వస్తుంది?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. డిజిటల్ యాప్‌ల పేరిట అన్నదాతలను రేవంత్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం పూర్తిగా ఆగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Harish Rao Comments | మిల్లర్ల చేతిలో సీఎం బ్రోకర్..
మిల్లర్ల చేతిలో సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy )బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో రైతులను రాబందుల్లా పీక్కుతింటున్న పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు చెప్పిన సీఎం.. దేవుళ్లపై ఒట్లు పెట్టి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను విస్మరించారని మండిపడ్డారు.
Harish Rao Comments | సాగునీరు అందించేలా..
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు, కాలువల ద్వారా ఎండాకాలంలోనూ, కరువు కాలంలోనూ పొలాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని హరీశ్‌రావు గుర్తుచేశారు. వందల మీటర్ల ఎత్తైన ప్రాంతాలకు సైతం సాగునీరు అందించేలా ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. రైతుబంధు క్రమం తప్పకుండా రావాలన్నా, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అందాలన్నా కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలని పిలుపునిచ్చారు. రైతుబంధు కావాలంటే రేవంత్‌రెడ్డిని ఇంటికి పంపాలని, రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీతో పాటు అన్ని వేదికలపై గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: KTR | రాష్ట్రానికో రంగు మారుస్తున్న రాహుల్ గాంధీ : కేటీఆర్