అక్షరటుడే వెబ్‌డెస్క్: NephroPlus Dialysis Academy | ప్రపంచవ్యాప్తంగా డయాలిసిస్ రంగంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన నర్సుల కొరతను తీర్చడంతో పాటు, వారికి దేశవిదేశాల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రముఖ డయాలిసిస్ నెట్వర్క్ ‘నెఫ్రోప్లస్’ (NephroPlus) సరికొత్త అకాడమీని లాంచ్ చేసింది. ‘నెఫ్రోప్లస్ ఇంటర్నేషనల్ డయాలిసిస్ అకాడమీ’ (NIDA – నిడా) పేరుతో ఈ ప్రతిష్టాత్మక శిక్షణా కేంద్రం ప్రారంభమైంది. భారత్, ఫిలిప్పీన్స్ దేశాల్లో నర్సింగ్ పూర్తి చేసిన యువతకు ఈ అకాడమీ ద్వారా ప్రత్యేక శిక్షణ అందించి, గ్లోబల్ లెవెల్లో రాణించేలా తీర్చిదిద్దనున్నారు.
NephroPlus Dialysis Academy | హైదరాబాద్‌లో తొలి కేంద్రం..
ఈ అకాడమీకి సంబంధించిన మొట్టమొదటి శిక్షణా కేంద్రాన్ని హైదరాబాద్‌లోని ( Hyderabad )బంజారా హిల్స్‌లో ఉన్న నెఫ్రోప్లస్ ప్రత్యేక డయాలిసిస్ కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెఫ్రోప్లస్ గ్రూప్ సీఈఓ రోహిత్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా, దీనికి సంబంధించిన రెండో కేంద్రాన్ని రాబోయే నవంబర్‌లో ఫిలిప్పీన్స్‌లోని క్వెజోన్ సిటీలో ప్రారంభించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
NephroPlus Dialysis Academy | శిక్షణా కార్యక్రమం ప్రత్యేకతలు..
భారత్‌లో నర్సింగ్ పూర్తి చేసిన వారికి ఈ శిక్షణ 24 నెలల పాటు ఉంటుంది. మొదటి 3 నెలలు తరగతి గదిలో థియరీతో పాటు ప్రాక్టికల్స్ నేర్పిస్తారు. మిగతా 21 నెలలు నెఫ్రోప్లస్ ఆసుపత్రుల్లో నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యక్షంగా పనిచేస్తూ అనుభవం గడిస్తారు. ఫిలిప్పీన్స్‌లోనూ ఇదే తరహాలో శిక్షణ కొనసాగుతుంది. కిడ్నీ వ్యాధులు, డయాలిసిస్ ప్రక్రియ, రోగుల సంరక్షణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణతో పాటు విదేశాల్లో పనిచేయడానికి అవసరమైన కమ్యూనికేషన్, భాషా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులను నిబంధనల ప్రకారం నెఫ్రోప్లస్ విదేశీ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశం కల్పిస్తుంది.
NephroPlus Dialysis Academy |అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం ..
ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ కేర్ సేవల్లో నిపుణులైన సిబ్బంది కొరతను అధిగమించడమే లక్ష్యంగా ‘నిడా’ను ఏర్పాటు చేసినట్లు నెఫ్రోప్లస్ సీఈఓ రోహిత్ సింగ్ తెలిపారు. ఇది కేవలం సర్టిఫికెట్ కోర్స్ మాత్రమే కాదని, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం సాధించేందుకు ఇదొక సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణలో డయాలిసిస్ అనేది అత్యంత సున్నితమైన విభాగమని, నర్సులకు సరైన ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించి గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టు తీర్చిదిద్దడమే తమ ఉద్దేశమని నెఫ్రోప్లస్ సహ వ్యవస్థాపకుడు కమల్ డి షా అన్నారు.
ఇది కూడా చదవండి: Nizamabad Water Resources | నీటి వనరులు వృథా కాకుండా చూడాలి..