EPFO WhatsApp Service | పీఎఫ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఒక్క ‘Hi’ మెసేజ్‌తో వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కోట్లాది మంది చందాదారులకు భారీ ఉపశమనం కలిగిస్తూ సరికొత్త డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO WhatsApp Service | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కోట్లాది మంది చందాదారులకు భారీ ఉపశమనం కలిగిస్తూ సరికొత్త డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పీఎఫ్ (PF) ఖాతాదారులు వివరాల కోసం వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే నేరుగా ‘వాట్సాప్’ (WhatsApp) ద్వారానే తమ ఖాతా బ్యాలెన్స్, చివరి లావాదేవీలు , పాస్‌బుక్ వివరాలను క్షణాల్లో పొందవచ్చు. ఈపీఎఫ్‌ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ నూతన సేవలను అధికారికంగా ప్రారంభించారు.

EPFO WhatsApp Service | ఒక్క ‘Hi’ మెసేజ్‌తో ..

ఈపీఎఫ్‌ఓ సభ్యులు తమ UAN తో లింక్ అయిన మొబైల్ నంబర్ నుండి +91 8796441800 అనే అధికారిక వాట్సాప్ నంబర్‌కు “Hi” లేదా “Hello” అని సందేశం పంపడం ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. సందేశం పంపిన తర్వాత ఆటోమేటెడ్ చాట్‌బాట్ ఇచ్చే సూచనల ఆధారంగా వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఆ వెంటనే స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే మెనూ నుండి తమ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు, ఇటీవల జరిగిన 5 లావాదేవీల వివరాలను తెలుసుకోవచ్చు , పాస్‌బుక్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

EPFO WhatsApp Service | సెకన్ల వ్యవధిలో ..

పీఎఫ్ చందాదారులు తమ చిన్న చిన్న ఖాతా వివరాలు లేదా బ్యాలెన్స్ సమాచారం కోసం ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ డిజిటల్ చొరవ ప్రధాన లక్ష్యం. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, సెకన్ల వ్యవధిలో పీఎఫ్ సమాచారాన్ని పొందేలా ఈ వాట్సాప్ చాట్‌బాట్‌ను తీర్చిదిద్దారు. ఇది డిజిటల్ సేవల వేగాన్ని పెంచడమే కాకుండా, సాధారణ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ సేవలను మరింత చేరువ చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

EPFO WhatsApp Service |ఆటోమేటిక్ సెటిల్‌మెంట్..

దీంతో పాటు ఈపీఎఫ్‌ఓ మరో కీలకమైన నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. ఏళ్ల తరబడి వాడకంలో లేని (Inoperative) పీఎఫ్ ఖాతాల్లో రూ.1,000 వరకు ఉన్న బ్యాలెన్స్‌ను ఎటువంటి క్లెయిమ్ దరఖాస్తు లేకుండానే ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఆధార్ వెరిఫికేషన్ , బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ పూర్తయిన ఇనాక్టివ్ ఖాతాదారుల నగదును నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ వినూత్న చర్య ద్వారా దాదాపు లక్ష ఖాతాల్లో పడి ఉన్న రూ.5 కోట్ల మేర సొమ్ము నేరుగా అసలైన లబ్ధిదారులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Rapthadu Attack Case | రాప్తాడు నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *