అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NIMS Hospital | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఏసీబీ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిమ్స్‌లో సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ నివాసాల్లో అధికారులు సోదాలు చేసి, భారీగా అక్రమాస్తులు గుర్తింంచిన విషయం తెలిసిందే. ఇటీవల ఏసీబీ అధికారులు టీజీ సేఫ్, కార్మిక శాఖకు చెందిన ప్రత్యేక బృందాలతో కలిసి సోమవారం సోదాలు చేపట్టారు. 2019-2025 మధ్యకాలంలో మానవ వనరుల సేవల కోసం టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదని అధికారులు గుర్తించారు. కార్మికుల నియామకంలో, వారిని సెమీ-స్కిల్డ్ కేటగిరీకి మార్చడంలో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. నియామక సంబంధిత కార్యకలాపాలలో పలువురు సిబ్బంది కుమ్మక్కు అయ్యారు.
NIMS Hospital | అధ్వానంగా క్యాంటీన్
నిమ్స్ ఆస్పత్రిని నిత్యం వేలాది మంది రోగులు సందర్శిస్తుంటారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈ ఆస్పత్రి క్యాంటీన్ అధ్వానంగా ఉంది. ప్రధాన క్యాంటీన్ అపరిశుభ్రమైన పరిస్థితులలో, గడువు ముగిసిన ఆహార పదార్థాలతో, FSSAI రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తోందని అధికారులు తెలిపారు. క్యాంటీన్ టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
NIMS Hospital | మెడికల్ షాపుల్లో..
నిమ్స్‌లో ప్రైవేట్ మెడికల్ షాపుల నిర్వహణకు అనుమతి ఉంది. ఈ విషయంలో సైతం కొందరు చేతివాటం ప్రదర్శించారు. మెడికల్ షాపులు అమ్మకాల రికార్డులను నిర్వహించకపోవడంతో పాటు, రిజిస్టర్ కాని కార్మికులను నియమించుకుంటున్నాయి. అంతేగాకుండా ఆపరేషన్ థియేటర్లలో సైతం మెడికల్ షాపులకు సంబంధించిన సామగ్రిని గుర్తించారు. ఆపరేషన్ థియేటర్లు, వాటి ఉప-స్టోర్ల సమీపంలోని అల్మారాలలో, సుమారు 5 కోట్ల రూపాయల విలువైన పెద్ద సంఖ్యలో ఇంప్లాంట్లు, ఇతర సరుకులు, అనుమతి లేకుండా ఉన్నట్లు తెలిపారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రధాన స్టోర్‌కు ఇండెంట్ ఇవ్వకుండా నేరుగా విక్రేతల నుండి ఇంప్లాంట్లను తీసుకుంటున్నారు. వాటిని ఉపయోగించిన తర్వాత యుటిలిటీ సర్టిఫికేట్‌ను సృష్టించి, దానిని విక్రేత ఇన్వాయిస్‌తో పాటు ప్రధాన స్టోర్‌కు పంపుతున్నట్లు తెలిపారు.
NIMS Hospital | చనిపోయిన వారికి సైతం బిల్లింగ్
ఆస్పత్రిలో చాలా సందర్భాల్లో రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్లులు ప్రాసెస్ చేసినట్లు ఏసీబీ అధికాకరులు తెలిపారు. ప్రభుత్వం చెల్లింపులు చేసే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న రోగుల విషయంలో ఇది జరిగినట్లు గుర్తింంచారు. కొన్ని సందర్భాల్లో, రోగి మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేయడం గమనార్హం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత సుమారు 66 లక్షల విలువైన బిల్లింగ్ ఎంట్రీలు చేశారు. అంతేగాకుండా ఆరోగ్య శ్రీ కింద చేసే శస్త్ర చికిత్సల్లో అవసరానికి మించి వస్తువులను వాడినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Kartika Purnima 2026 | కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారు? దీని పురాణ మహత్యం ఏమిటంటే..