Paddy Procurement | కల్లాల వద్దే ధాన్యం కొనుగోళ్లు.. అన్నదాతకు లాభాలు!

వరి సాగు చేసిన రైతులకు ఈసారి ధర కలిసివస్తోంది. వ్యాపారులు, దళారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తుండటంతో మద్దతు ధరకు మించి ధాన్యం పలుకుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Paddy Procurement | వరిసాగు చేసిన రైతులకు ఈసారి ధర కలిసివస్తోంది. గతంలో ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం మిల్లర్లు, స్థానిక వ్యాపారులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొనుగోలుదారులు ధాన్యం సేకరణకు పోటీపడుతుండటంతో రైతులకు మెరుగైన ధర లభిస్తోంది. క్వింటాలుకు రూ.3,300 నుంచి రూ.3,400 వరకు చెల్లిస్తున్నారు. కొన్ని రకాల ధాన్యానికి నాణ్యత, డిమాండ్‌ను బట్టి మరింత ధర పలుకుతోంది.

Paddy Procurement | 4.35 లక్షల ఎకరాల్లో సాగు

నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో ఈ వానాకాలం సుమారు 4.35 లక్షల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఇందులో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంత భారీ విస్తీర్ణంలో సాగైన ధాన్యానికి మార్కెట్లోనూ డిమాండ్ ఉండటంతో కొనుగోలుదారులు రైతుల వద్దకు వస్తున్నారు. ముఖ్యంగా పచ్చి ధాన్యాన్నే కల్లాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండటంతో అన్నదాతకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతోంది.

Paddy Procurement | పోటీతో పెరిగిన ధరలు

గతంలో సాధారణ సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,300 మద్దతు ధర లభించేది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కొనుగోలుదారుల మధ్య పోటీ నెలకొనడంతో పచ్చి ధాన్యానికే రూ.3,300 నుంచి రూ.3,400 వరకు ధర పలుకుతోంది. ముఖ్యంగా బీపీటీ వంటి సన్న రకాలపై వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోళ్లు సాగిస్తున్నారు. దీంతో రైతులకు తమ పంటను విక్రయించేందుకు ప్రత్యామ్నాయ అవకాశాలు పెరిగాయి.

Paddy Procurement | మిల్లర్లకూ ధాన్యం అవసరం

ప్రభుత్వానికి గతంలో కేటాయించిన ధాన్యం నిల్వలు, కస్టమ్ మిల్లింగ్ బియ్యం సరఫరా బాధ్యతల నేపథ్యంలో మిల్లర్లకు ధాన్యం సేకరణ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో కొందరు మిల్లర్లు రైతుల వద్ద నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకతో మార్కెట్లో పోటీ పెరిగింది. ఈ పరిణామం రైతులకు అనుకూలంగా మారుతోంది. గతంలో ధాన్యాన్ని ఆరబెట్టి, తూకం వేయించి కొనుగోలు కేంద్రాలకు తరలించే క్రమంలో రైతులు రవాణా, హమాలీ తదితర ఖర్చులు భరించాల్సి వచ్చేది. ప్రస్తుతం పలుచోట్ల వ్యాపారులే నేరుగా రైతుల కల్లాల వద్దకు వచ్చి పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. తేమశాతం, ధాన్యం రకం, నాణ్యత ఆధారంగా ధర నిర్ణయిస్తున్నారు. దీంతో రైతులకు సమయం, శ్రమతోపాటు అదనపు ఖర్చులు కూడా తగ్గుతున్నాయి.

Paddy Procurement | అన్నదాతకు మేలు

ఒకవైపు సాగు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో మరోవైపు పంటకు మెరుగైన ధర లభించడం రైతులకు ఊరటనిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధరతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర లభించే పరిస్థితి ఏర్పడింది. కొనుగోలుదారుల మధ్య పోటీ కొనసాగితే రైతులకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశముంది. మొత్తంగా ఈసారి ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న పోటీ అన్నదాతకు ఆర్థికంగా కలిసివస్తోంది.

ఇది కూడా చదవండి..: Madhav Nagar ROB | మాధవ్ నగర్ ఆర్‌వోబీకి అదనపు నిధులు మంజూరు.. ఎంపీ అర్వింద్ హర్షం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *