అక్షరటుడే వెబ్‌డెస్క్: Warangal Development | వరంగల్ నగరాభివృద్ధికి కేంద్రం చేసిన కృషిపై చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy )కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కోరారు. “అబద్ధపు సవాళ్లతో కాకుండా, పక్కా లెక్కలతో చర్చకు సిద్ధం. దమ్ముంటే రండి” అని ఆయన సవాల్ విసిరారు. వరంగల్ గడ్డపై బీజేపీ చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.
Warangal Development | కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
వరంగల్ అభివృద్ధి కోసం కేంద్రం సుమారు రూ.17 వేల కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. గతంలో రాదనుకున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరం వరంగల్ విమానాశ్రయం పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా మంజూరు చేసిన 7 మెగా టెక్స్టైల్ పార్కులలో ఒక దానిని వరంగల్‌కు ఇచ్చామని, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో బీజేపీ కృషి ఎంతో ఉందన్నారు. ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ పనులు మొదలు కాబోతున్నాయని ఆయన ప్రకటించారు.

Warangal Development | తెలంగాణలో బీజేపీ రావాలి..
రాష్ట్రంలోని పరిస్థితులపై స్పందిస్తూ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణను అప్పుల పాలు చేసి దగా చేశాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ప్రభుత్వంలోని కీలక ఉద్యోగులు కూడా తనను కలిసినప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలే అందుకు నాంది కాబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే రాష్ట్రంలో ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Nizamabad ACP Appointments | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏసీపీల నియామకం..