అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paper Leak Fast Track Courts | నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా ప్రకటించారు.
మన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని మోదీ పేర్కొన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ (పేపర్ లీక్) కేసుల విచారణ కోసం ‘ఫాస్ట్-ట్రాక్ కోర్టుల’ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Paper Leak Fast Track Courts | రాజీనామా చేయాల్సిందే
విపక్షాలు, ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆందోళనలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై సీజేపీ స్పందించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని పేర్కొంది. అప్పటి వరకు ఆందోళనలు విరమించమని స్పష్టం చేశారు. మరోవైపు విపక్షాలు సైతం పార్లమెంట్లో ఇదే విషయమై ఆందోళన చేస్తున్నాయి. కేంద్రం చర్చకు అంగీకరించినా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే నీట్‌పై చర్చించాలని పట్టుబడుతున్నాయి.
Paper Leak Fast Track Courts | జంతర్‌మంతర్ వద్ద బలగాల మోహరింపు
జంతర్‌మంతర్ వద్దకు గురువారం ఉదయం సీజేపీ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు ఆందోళనలు ఆగవని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపి వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జంతర్‌మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జంతర్‌మంతర్ నుంచి పార్లమెంట్‌కు వెళ్లే రోడ్లు దిగ్బంధించారు. భారీగా CRPF, RAF, ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరించారు.
ఇది కూడా చదవండి..: Jantar Mantar Violence | జంతర్‌మంతర్‌లో మళ్లీ హింస.. పోలీసులపైకి రాళ్లు, బాటిళ్లతో దాడి