అక్షరటుడే, పోచంపాడ్: Pochampad Road Accident | నిజామాబాద్ జిల్లా మెండోరా (Mendora) మండలంలోని పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Pochampad Road Accident | డివైడర్‌ను ఢీకొన్న అనంతరం..
నిర్మల్ వైపు నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ఎర్టిగా కారు మొదట డివైడర్‌ను ఢీకొంది. అనంతరం రోడ్డుపై వెళ్తున్న దూదిగాం గ్రామానికి చెందిన పసుల గంగారాం (60) ను ఢీకొనగా.. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం దూదిగాం గ్రామస్థులు పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు.
పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్-44పై అండర్‌పాస్ నిర్మించి ప్రజలకు రహదారి దాటేందుకు శాశ్వత సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
Pochampad Road Accident | పదేళ్లుగా అండర్‌పాస్ కోసం డిమాండ్
పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద అండర్‌పాస్ నిర్మించాలనే డిమాండ్ దాదాపు పదేళ్లుగా ఉందని గ్రామస్థులు తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని వాపోయారు.
రైతులు, స్థానిక ప్రజలు రహదారి దాటే సమయంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, ఇకనైనా సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. ధర్నా విషయం తెలుసుకున్న ఏసీపీ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు.
పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద ప్రమాదాల నివారణకు అండర్‌పాస్ నిర్మాణం కోసం సంబంధిత అధికారులకు గ్రామస్థుల వినతిని పంపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు ధర్నా విరమించారు. కేసు నమోదు చేసుకున్న మెండోరా ఎస్సై సుహాసిని దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: హుస్సేన్‌సాగర్ తీరాన పింక్ పవర్ రన్ 3.0