అక్షరటుడే వెబ్డెస్క్: Ponnam Prabhakar Vote Rights | దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar Vote Rights | అక్రమాలపై ఆందోళన..
ఎన్నికల సంఘం అత్యంత నిష్పక్షపాతంగా, ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా వ్యవహరించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అయితే, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో ఓట్ల తొలగింపు , ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Ponnam Prabhakar Vote Rights | అరెస్టులు అప్రజాస్వామికం..
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో “ఓటు బచావో – దేశ్ బచావో” నినాదంతో ఉద్యమాన్ని చేపట్టిందని తెలిపారు. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర జాతీయ నాయకులను అదుపులోకి తీసుకోవడం పూర్తిగా అప్రజాస్వామికమని, నియంతృత్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజల గొంతుకను అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచలేరని స్పష్టం చేశారు.
Ponnam Prabhakar Vote Rights | ప్రజాస్వామ్య గుర్తింపు..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలోనే 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించారని, అది ప్రతి భారతీయుడి ప్రజాస్వామ్య గుర్తింపు అని గుర్తుచేశారు. ఈ పోరాటం కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, ప్రతి ఓటరు హక్కుకు సంబంధించినదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని, ఈ ఉద్యమాన్ని గ్రామగ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయ సాధన కోసం ఓటు హక్కును, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అందరూ సంఘటితంగా పోరాడాలని ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: Airport Bus Ticket Prices | భారీగా తగ్గిన ఎయిర్పోర్ట్ బస్సు టికెట్ ధరలు