అక్షరటుడే వెబ్‌డెస్క్: Puja Items | హిందూ సంప్రదాయంలో పూజా వస్తువులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత, పవిత్రత ఉంటుంది. ఇంట్లో పూజకు ఉపయోగించే దేవతల విగ్రహాలు, శంఖం, శివలింగం వంటి ముఖ్యమైన వస్తువులను భద్రపరిచే విషయంలో కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పవిత్ర వస్తువులను నేరుగా నేలపై ఉంచడం అగౌరవంగా భావిస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని పండితులు హెచ్చరిస్తుంటారు. పూజా సామగ్రిని ఎప్పుడూ శుభ్రమైన వస్త్రం, ఆసనం లేదా పీఠంపై ఉంచాలి.
Puja Items | దేవతల విగ్రహాలు..
దేవుళ్లు, దేవతల విగ్రహాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే వాటిని నేరుగా నేలపై ఉంచకూడదు. ఇంటి పూజా మందిరంలో ఈ విగ్రహాలను శుభ్రమైన పీఠం లేదా బల్లపై కొలువుదీర్చాలి. పూజా స్థలాన్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పూజలో దీపానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. దీపాన్ని జ్ఞానానికి, వెలుగుకు ప్రతీకగా చూస్తారు కాబట్టి, వెలిగించిన దీపాన్ని నేరుగా నేలపై ఉంచరాదు. దీపం స్టాండ్ లేదా చిన్న పళ్లెంలో ఉంచడం శ్రేయస్కరం.
Puja Items | శంఖం, శివలింగం..
హిందూ ఆచారాల్లో శంఖానికి విశేష స్థానం ఉంది. దీనిని విష్ణుమూర్తి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి పూజ తర్వాత శంఖాన్ని శుభ్రమైన వస్త్రంపై లేదా పూజా పీఠంపై భద్రపరచాలి. అలాగే శాలిగ్రామాలు, శివలింగాలను ( shivalingam )సైతం అత్యంత పవిత్రంగా ఆరాధిస్తారు. వీటిని ఇళ్లలో పూజించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ఉంచడం ఆనవాయితీ. భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి ధార్మిక గ్రంథాలు జ్ఞానానికి ప్రతీకలు. కాబట్టి ఈ పుస్తకాలను నేలపై ఉంచకుండా శుభ్రమైన వస్త్రంపై లేదా పుస్తకాల స్టాండ్‌పై ఉంచాలి. మరోవైపు హిందూ విశ్వాసాల ప్రకారం బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా చూస్తారు. అందుకే ఆభరణాలను తీసిన వెంటనే నేలపై ఉంచకుండా బాక్స్‌లో లేదా లాకర్‌లో భద్రపరచాలి.
Puja Items | పొరపాటున నేలపై పడితే?
ఒకవేళ పొరపాటున ఏదైనా పూజా వస్తువు నేలపై పడిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ వస్తువును తీసుకుని శుభ్రమైన నీటితో కడిగి మళ్లీ పీఠంపై ఉంచవచ్చు. ఆ తర్వాత దేవుడిని ప్రార్థించి క్షమాపణ కోరుకుంటే సరిపోతుంది. పూజా వస్తువుల పట్ల భక్తి శ్రద్ధలు, పవిత్రత పాటించడమే హిందూ సంప్రదాయాల ప్రధాన ఉద్దేశం.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka Comments | శుద్ధి చేయాల్సింది నేలను కాదు, మీ కులబుద్ధిని: భట్టి విక్రమార్క