అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhatti Vikramarka Comments | ఎర్రవల్లిలోని కేసీఆర్ ( KCR )ఫామ్‌హౌస్ పరిసరాల్లో దళితులు నిరసన తెలిపిన తర్వాత పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహించడంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితులు నడిచిన నేలను కడిగేయడం సభ్య సమాజానికి తీరని అవమానమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఫ్యూడల్ భావజాలానికి చోటు లేదని స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా బీఆర్ఎస్, బీజేపీల కుల వివక్ష వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
Bhatti Vikramarka Comments | మనుషుల కంటే కులం గొప్పదా?
ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్లిన దళిత నేతలు నడిచిన ప్రాంతంలో బీఆర్‌ఎస్ శ్రేణులు పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. “శుద్ధి చేయాల్సింది నేలను కాదు.. కులజాడ్యంతో నిండిన మీ బుద్ధిని” అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేతను ప్రతిపక్ష సభ్యులు అవమానించిన ఘటన సభను తీవ్ర క్షోభకు గురిచేసిందని, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకే మళ్లీ ఇలాంటి వివక్షాపూరిత చర్యలకు పాల్పడుతున్నారని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర పునాదులే ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై నిర్మితమయ్యాయని భట్టి గుర్తుచేశారు. మనుషుల కంటే కులం గొప్పది కాదని, రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వాన్ని ప్రసాదించిందని చెప్పారు. ఇప్పటికీ భూస్వామ్య విధానాల భ్రమల్లో బతుకుతున్నవారి ఆలోచనలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని హెచ్చరించారు.
Bhatti Vikramarka Comments | బీజేపీ తీరుపై కూడా ధ్వజం..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేసిన ఉదంతాన్ని భట్టి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గేను కేవలం ఆయన కులాన్ని బట్టి బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. ఢిల్లీలో బీజేపీ అనుసరించే వివక్షా పూరిత రాజకీయాలనే తెలంగాణలో బీఆర్‌ఎస్ కూడా పునరావృతం చేస్తోందని, ప్రజలు ఈ కుల రాజకీయాలను కచ్చితంగా తిప్పికొడతారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Power Cuts | కరెంట్ ‘కట్’కట.. ఎండిపోతున్న పంటలు