అక్షరటుడే వెబ్‌డెస్క్: Pune Rapido Driver | మహారాష్ట్రలోని పుణెలో ( Pune ) ఓ రాపిడో బైక్ డ్రైవర్‌కు నిరాశ ఎదురైంది. బైక్ రైడ్ ముగిసిన తర్వాత ప్రయాణానికి సంబంధించిన డబ్బులు చెల్లించమని అడిగినందుకు.. ఓ మహిళా ఉద్యోగిని డబ్బులు ఇవ్వకపోగా డ్రైవర్‌పైనే తిరిగి బెదిరింపులకు దిగింది. ఎక్కువ మాట్లాడితే తప్పుడు కేసులు పెడతానంటూ ఆమె హెచ్చరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Pune Rapido Driver | డబ్బులు అడిగితే బెదిరింపులు..
బాధిత డ్రైవర్ , స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో ఓ మహిళ రాపిడో బైక్ సర్వీస్‌ను ఆశ్రయించింది. ప్రయాణం ముగిసి గమ్యస్థానానికి చేరుకున్నాక డ్రైవర్ రైడ్ ఛార్జీలు అడిగాడు. అయితే డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన ఆ మహిళ, డ్రైవర్‌పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (TCS) లో ఉద్యోగినని గర్వంగా చెప్పుకుంటూ డ్రైవర్‌ను భయపెట్టే ప్రయత్నం చేసింది. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దబాయించింది. ఏ కంపెనీలో పనిచేస్తున్నావని డ్రైవర్ నిలదీయడంతో, ఆమె తన మెడలో ఉన్న టీసీఎస్ ఐడీ కార్డును వెనక్కి తీసుకుని దాచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Pune Rapido Driver | నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత..
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి బతికే చిరుద్యోగులను గౌరవించాల్సింది పోయి, ఐటీ ఉద్యోగంలో ఉన్నామనే అహంకారంతో ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఆఫీసుల్లో నేర్చుకునే చట్టపరమైన శిక్షణలను కొందరు ఇలా దుర్వినియోగం చేస్తూ అమాయక శ్రామికులపై బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kamareddy Tree Plantation | మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్