అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCB Player Honesty | సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు, రికార్డుల గురించే చర్చ జరుగుతుంది. కానీ ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ఓ విభిన్న ఘటనతో వార్తల్లో నిలిచింది. మ్యాచ్ ఫలితం కంటే కూడా ఆర్‌సీబీ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ చూపించిన నిజాయితీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
ఈ ఆసక్తికర ఘటన బెంగళూరు (Royal Challengers Bangalore) ఇన్నింగ్స్ సమయంలో జరిగింది. ఆర్‌సీబీ ఓపెనర్ జాకబ్ బెథెల్ నాలుగో ఓవర్‌లో కార్తీక్ త్యాగి వేసిన షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కొన్నాడు. వేగంగా వచ్చిన ఆ బంతి ముందుగా బ్యాట్‌ను తాకి, తర్వాత బెథెల్ హెల్మెట్‌ను బలంగా తాకింది. ఆ దెబ్బ ప్రభావంతో అతని మెడలో ఉన్న బంగారు గొలుసు తెగి మైదానంలో పడిపోయింది.
RCB Player Honesty | అంపైర్స్‌కి ఇచ్చాడు..
అయితే ఆ సమయంలో బెథెల్ దానిని గమనించలేదు. కొద్దిసేపటికే 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయి నేరుగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ పిచ్‌పై పడివున్న గొలుసును గమనించాడు. అది విలువైన బంగారు చైన్ అని అర్థం చేసుకున్న పడిక్కల్, వెంటనే దాన్ని తీసుకుని అంపైర్లకు, మ్యాచ్ అధికారులకు అప్పగించాడు. పడిక్కల్ చూపిన ఈ చొరవకు సోషల్ మీడియా (Social Media)లో భారీగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “ఇదే నిజమైన స్పోర్ట్స్‌మన్ స్పిరిట్”, “పడిక్కల్ క్లాస్ ప్లేయర్” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ అతను గమనించకపోతే ఆ గొలుసు మట్టిలో కలిసిపోయే అవకాశం ఉండేదని, లేదా ఆటగాళ్ల షూల కింద పడి దెబ్బతినేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
RCB Player Honesty | ట్రెండ్ అవుతున్న పేరు మాత్రం దేవదత్ పడిక్కల్‌దే
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, జాకబ్ బెథెల్ ఫామ్ మాత్రం ఆర్‌సీబీని ఆందోళనకు గురిచేస్తోంది. ఫిలిప్ సాల్ట్ గాయంతో జట్టులోకి వచ్చిన బెథెల్ ఇప్పటివరకు ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 85 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 27 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఓపెనర్‌గా జట్టుకు బలమైన ఆరంభం ఇవ్వాల్సిన సమయంలో వరుసగా విఫలమవ్వడం ఆర్‌సీబీకి మైనస్‌గా మారుతోంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఘన విజయం సాధించడంతో ఆ లోటు పెద్దగా కనిపించలేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న పేరు మాత్రం దేవదత్ పడిక్కల్‌దే కావడం విశేషం.
ఇది కూడా చదవండి..: Virat Kohli Century | రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. విరాట్ సెంచరీతో సంచలన విజయం సాధించిన ఆర్సీబీ


