అక్షరటుడే, వెబ్డెస్క్: Reservation Verdict | మతం మారితే రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తికి అంతకు ముందు ఉన్న బీసీ రిజర్వేషన్ అర్హత ఉండదని గురువారం పేర్కొంది.
ఒక వ్యక్తి మరో మతంలోకి మారితే అతని సామాజిక వెనుకబాటుతనాన్ని హిందూ సామాజిక వ్యవస్థ నుంచి హిందూయేతర సామాజిక వ్యవస్థకు బదిలీ చేయలేరని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ముస్లిం మతంలోకి మారిన వ్యక్తి వెనుకబడిన తరగతి (ముస్లిం) కేటగిరీ కింద రిజర్వేషన్ కోరలేరని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. పిటిషన్ను కొట్టివేసింది.
Reservation Verdict | కులంలో సభ్యత్వం లభించదు
ఇతర మతంలోకి మారినంత మాత్రాన.. దానంతట అదే ఏదైనా నిర్దిష్ట వెనుకబడిన కుల వర్గంలో సభ్యత్వం లభించదని కోర్టు తెలిపింది. మతం మారిన ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, డినోటిఫైడ్ కమ్యూనిటీలు లేదా షెడ్యూల్డ్ కులాల నుండి ఇస్లాంలోకి మారిన వ్యక్తిని బీసీ (ముస్లిం)గా పరిగణించి, మత మార్పిడి తర్వాత రిజర్వేషన్ పొందేందుకు గాను, నోటిఫై చేయబడిన 7 వర్గాలలో ఒకదానికి చెందిన వ్యక్తిగా కమ్యూనిటీ సర్టిఫికేట్ జారీ చేయడానికి అనుమతించింది. దీనిని హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారు మత మార్పిడి కారణంగా రిజర్వేషన్ ప్రయోజనాన్ని కోల్పోకూడదని వాదించింది. అయితే ఆ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
Reservation Verdict | ఎలాంటి ప్రయోజనం పొందలేరు
1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు కూడా హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాని వ్యక్తులకు షెడ్యూల్డ్ కుల హోదాను విస్తరించలేమని గుర్తిస్తోందని కోర్టు పేర్కొంది. అందులో పేర్కొనబడని మతంలోకి మారిన వ్యక్తి, తన పూర్వ కులానికి సంబంధించిన షెడ్యూల్డ్ కుల హోదాను కోల్పోతాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద వెనుకబడిన తరగతికి సంబంధించిన ఎలాంటి రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందలేడని కోర్టు తెలిపింది.
ఇది కూడా చదవండి..: Imran Khan | నటుడు ఇమ్రాన్ ఖాన్కు షాక్.. దేశం విడిచి వెళ్లాలన్న పోలీసులు