అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Restaurant Food Safety | హైదరాబాద్ నగరంలో చాలా మంది రెస్టారెంట్లలో ఎంతో ఇష్టంగా తింటారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో భారీగా డబ్బులు చెల్లించి ఆహారం కోసం వెళ్తారు. అయితే పేరుకు పెద్ద హోటళ్లు అయినా.. కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం, ఎలుకలు, బొద్దింకలు దర్శనం ఇస్తున్నాయి. ఇవి ప్రజారోగ్యానికి చేటు చేస్తాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో శనివారం ఫుడ్ సేఫ్టీ (TG SAFE) అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్‌లో బొద్దింకలు, కుళ్ళిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఎలుకల రెట్టలు, అపరిశుభ్రమైన వంటశాలలను గుర్తించారు. వినియోగదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసే పెద్ద రెస్టారెంట్లలో సైతం పరిశుభ్రత పాటించకపోవడం గమనార్హం. తనిఖీల అనంతరం అధికారులు 14 సంస్థల లైసెన్సులను రద్దు చేశారు.
Restaurant Food Safety | 22 బృందాలు
ఆహార భద్రతా అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి 22 బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. గోల్కొండ, చార్మినార్ జోన్‌లలోని 22 రెస్టారెంట్లు, ఇతర ఆహార సంస్థలను తనిఖీ చేశాయి. ఆహార నిల్వ, వంటశాలల నిర్వహణ, పరిశుభ్రత పద్ధతులలో అనేక లోపాలను అధికారులు గుర్తించారు. కిచెన్‌లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడదను సూచించే రెట్టలు, పాడైపోయిన కూరగాయలు, శిలీంధ్రాల కాలుష్యం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు.
Restaurant Food Safety | నేలపైనే ఆహార పదార్థాలు
అనేక వంటశాలల్లో, ఆహార పదార్థాలను నేరుగా నేలపై నిల్వ ఉంచారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. వేయించిన వంటనూనెను పదే పదే వాడుతున్నట్లు పేర్కొన్నారు. కిచెన్‌లో పాడైన నేలలు, నిలిచిపోయిన నీరు, మురికి చిమ్నీలు, మురుగు నీరు వెళ్లే వ్యవస్థ సక్రమంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Restaurant Food Safety | ఈ హోటళ్ల లైసెన్స్‌లు రద్దు
టోలిచౌకిలోని హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడుపి వెజ్, సంతోష్ నగర్‌లోని లక్కీ రెస్టారెంట్, నయాపూల్‌లోని హోటల్ నయాబ్, శాలిబండలోని షా ఘౌస్ కేఫ్, గుడిమల్కాపూర్‌లోని శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా, సిద్ధిక్ కబాబ్ సెంట్రల్ కిచెన్ లైసెన్స్‌లను అధికారులు రద్దు చేశారు. వీటితో పాటు టోలిచౌకిలోని అల్సబా హోటల్, దిల్‌సుఖ్‌నగర్‌లోని మెహఫిల్ రెస్టారెంట్, సంతోష్ నగర్‌లోని హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడుపి వెజ్, మసబ్ ట్యాంక్‌లోని డైన్ హిల్ రెస్టారెంట్, మలక్‌పేట్‌లోని సోహైల్ రెస్టారెంట్, హోటల్ అక్షయ టిఫిన్స్, ఎంజేఆర్ రోడ్డులోని హోటల్ వెంకటేశ్వర, రేతీబౌలిలోని ఈజీబో ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్లపై సైతం చర్యలు తీసుకున్నారు. తనిఖీలో అధికారులు సుమారు 544 కిలోల పాడైపోయిన కూరగాయలు, మిగిలిపోయిన ఆహారం, గడువు ముగిసిన ఉత్పత్తులు, పురుగులు పట్టిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు.
దీనిని కూడా చదవండి : Fox Sagar Lake | ఫాక్స్ సాగర్ చెరువు పునరుద్ధణకు హైడ్రా చర్యలు