ROB Central Funds | భూపతిరెడ్డి ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావ్ : ఎంపీ అర్వింద్​

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఎంపీ ధర్మపురి అర్వింద్​ కౌంటర్ ఇచ్చారు.

shashi kiran Mottala

​అక్షరటుడే, ఇందూరు: ROB Central Funds | ‘భూపతి రెడ్డి.. ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నావ్?’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. అర్సపల్లి(Arsapally) రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

​ROB Central Funds | ఆర్వోబీ నిర్మాణ ప్రక్రియ..

ఆర్వోబీ నిర్మాణ ప్రక్రియను వివరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బిల్లులు విడుదల చేసి కేంద్రానికి పంపితే, కేవలం 48 నుంచి 72 గంటల్లోనే కేంద్రం నుంచి ఆ నిధులు విడుదలవుతాయని ఎంపీ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.14.77 కోట్లలో రూ.13.65 కోట్లు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులేనని స్పష్టం చేశారు. ఈ బిల్లుల విడుదల ప్రక్రియ వేగవంతం చేయాలని తాను స్వయంగా రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను పలుమార్లు కోరినట్లు గుర్తుచేశారు. ​ఈ సందర్భంగా మాధవ్ నగర్ ఆర్వోబీ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎంపీ అర్వింద్ పలు ప్రశ్నలు గుప్పించారు.

ROB Central Funds | మాధవనగర్​ ఆర్వోబీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..

మాధవ్ నగర్ ఆర్వోబీకి సంబంధించి రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అదనపు నిధులకు పరిపాలనా అనుమతులు ఎవరు ఇప్పించాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డిని నిలదీశారు. ఈ అనుమతులు తక్షణమే రాకపోతే, ఆర్వోబీ రెండో వైపు కాంట్రాక్టర్ పనులు కొనసాగించే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎంతో అత్యవసరమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. ‘కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురావాలో మాకు బాగా తెలుసు, మాకు ఎవరి సలహాలూ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలి’ అని హితవు పలికారు. ​రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మాధవ్ నగర్ ఆర్వోబీ పరిపాలనా అనుమతులను వెంటనే ఇప్పించాలని, లేని పక్షంలో త్వరలోనే పెద్ద ఎత్తున పోరుబాట చేపడతామని ఎంపీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *