Telangana folk song | యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సెన్సేషన్ : అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ రికార్డును బద్దలు కొట్టిన ‘రాను బొంబాయికి రాను’!

కల్యాణ్ కీస్ అందించిన అదిరిపోయే ఫోక్ బీట్, తెలంగాణ యాసలోని పదాలు, పల్లెటూరి నేపథ్యం యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana folk song | తెలంగాణ మట్టి వాసన, పల్లె పదాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల క్రేజ్, కోట్ల రూపాయల విజువల్ ఎఫెక్ట్స్ ఏవీ లేకుండానే ఓ అచ్చమైన జానపద గీతం యూట్యూబ్‌లో సరికొత్త చరిత్రను లిఖించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సంచలన గీతం ‘బుట్టబొమ్మ’ ఆల్-టైమ్ రికార్డును సైతం అధిగమించి, తెలంగాణ ఫోక్ సాంగ్ ‘రాను రాను బొంబాయికి రాను’ ఇప్పుడు తెలుగు యూట్యూబ్ చరిత్రలో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది.

Telangana folk song | ఆరేళ్ల రికార్డును ఏడాదిన్నరలోనే చెరిపేసి..

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాట ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమన్ బాణీలు, బన్నీ స్టైలిష్ స్టెప్పులతో ఆ పాట దాదాపు ఆరేళ్ల వ్యవధిలో 955 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, అత్యధిక వ్యూస్ పొందిన తెలుగు పాటగా తిరుగులేని రికార్డును సొంతం చేసుకుంది.

అయితే, ఆ రికార్డును ఇప్పుడు ‘రాను రాను బొంబాయికి రాను’ పాట వెనక్కి నెట్టింది. 2025 జనవరి 23న ‘రాథోడ్ ట్యూన్స్’ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన ఈ జానపద గీతం, కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా 957 మిలియన్లకు (95.7 కోట్లు) పైగా వ్యూస్ సాధించి టాలీవుడ్ దిగ్గజ గీతాలకే షాక్ ఇచ్చింది.

Telangana folk song | ఈ సంచలన విజయం వెనుక ఉన్నది వీరే..

రాము రాథోడ్ స్వయంగా సాహిత్యం అందించి ఆలపించిన ఈ పాటకు గాయని ప్రభ తన మధురమైన గాత్రాన్ని జతచేశారు. తెరపై లిఖిత తన సహజమైన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కల్యాణ్ కీస్ అందించిన అదిరిపోయే ఫోక్ బీట్, తెలంగాణ యాసలోని పదాలు, పల్లెటూరి నేపథ్యం యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Telangana folk song | టాప్ లిస్టులో ఉన్న ఇతర పాటలు ఇవే

దక్షిణాది సినీ చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటల జాబితాను పరిశీలిస్తే.. ధనుష్, సాయి పల్లవి నటించిన ‘మారి 2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సుమారు 1.77 బిలియన్ల వ్యూస్తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇక తెలుగు పాటల విభాగంలో ‘రాను రాను బొంబాయికి రాను’ అగ్రస్థానానికి చేరడంతో, ‘బుట్టబొమ్మ’ రెండో స్థానానికి, సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాలోని మాస్ నంబర్ ‘కుర్చీ మడతపెట్టి’ మూడో స్థానానికి చేరాయి.

కేవలం పెద్ద సినిమా పాటలకే పరిమితమైన యూట్యూబ్ రికార్డులను ఒక స్వతంత్ర జానపద గీతం తిరగరాయడం నిజంగా విశేషం. పల్లె పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారనడానికి ఈ అద్భుత విజయం ఒక నిదర్శనం.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *