అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Traffic Challan | తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ప్రకటించింది. ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన చలాన్లను సంప్రదాయ కాగితపు రూపంలో కాకుండా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పంపాలని నిర్ణయించింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ రవాణా, రహదారులు – భవనాల (TR-I) శాఖ అధికారిక జీవో (G.O.Ms.No. 25, తేదీ: 01-06-2026) విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, వాహనదారులకు చలాన్లను నేరుగా వారి మొబైల్ నంబర్లకు SMS, WhatsApp, ఇ-మెయిల్ ద్వారా పంపిస్తారు.
Telangana Traffic Challan | నెల రోజులలోగా
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (CMV Rules, 1989) లోని రూల్ 167 సబ్-రూల్ (1), (2) ప్రకారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో చలాన్లు జారీ చేసేందుకు వీలుగా సబ్-రూల్ (3) ద్వారా పొందిన అధికారాలను వినియోగించుకుంటూ రవాణా శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను సర్కారు క్షుణ్ణంగా పరిశీలించి, జూన్ 2, 2026 నాటి తెలంగాణ గెజెట్ అసాధారణ సంచికలో ఈ నోటిఫికేషన్‌ను ప్రచురించాలని ఆదేశించింది.
Telangana Traffic Challan : వివరాలు అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందులే!
ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని వాహనదారులందరూ నెల రోజులలోగా (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి) కేంద్ర ప్రభుత్వ అధికారిక ‘వాహన్’ (Vahan) పోర్టల్ (http://vahan.parivahan.gov.in) సందర్శించి, తమ ప్రస్తుత మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
Telangana Traffic Challan | డిజిటల్ చలాన్లే అధికారిక నోటీసులు:
గడువు ముగిశాక, వాహన్ పోర్టల్‌లో నమోదై ఉన్న మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీకి పంపిన డిజిటల్ చలాన్లను (SMS, WhatsApp, ఇ-మెయిల్ ద్వారా) సదరు వాహనదారుడికి నేరుగా అందిన అధికారిక నోటీసులు, సమన్లుగానే చట్టబద్ధంగా పరిగణిస్తారు. సమాచారం అందలేదనే సాకులు చెప్పడానికి వీలుండదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, చలాన్ల సమాచారం వాహనదారులకు తక్షణమే చేరుతుంది. దీనివల్ల నకిలీ నంబరు ప్లేట్లు, ఇతరుల పేర్లపై ఉన్న వాహనాల ద్వారా జరిగే ఉల్లంఘనలను అరికట్టడానికి వీలవుతుంది.
ఈ డిజిటల్ విధానానికి వాహనదారులందరూ సహకరించి, సకాలంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
Paddy Procurement Assurance | రైతులు అధైర్యపడొద్దు.. తడిసిన ధాన్యం కొంటాం…


