అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TGPSC AEE Exam | టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కోరారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు.
ఏఈఈ పరీక్షను నవంబర్ 6న నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఎసెస్సీ జేఈ పరీక్ష ఉంది. రెండు పరీక్షలు ఒకేరోజు ఉండటంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు శనివారం హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
TGPSC AEE Exam | అవకాశాలు దెబ్బతీయొద్దు
తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయొద్దని హారీశ్‌రావు కోరారు. నవంబర్ 6న జరగనున్న TGPSC AEE పరీక్షను వెంటనే వాయిదా వేయాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో SSC JE పరీక్ష రాసే అభ్యర్థులు వెంటనే తెలంగాణకు తిరిగొచ్చి AEE పరీక్ష రాయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కష్టపడి సిద్ధమైన రెండు పోటీ పరీక్షల్లో ఒకదాన్ని వదులుకోవాల్సిన దుస్థితిలో నిరుద్యోగ యువత ఉందన్నారు. పరీక్షల తేదీలను పునఃపరిశీలించాలని అక్టోబర్ 14నే TGPSCకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు. అయినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TGPSC AEE Exam | ఇతర రాష్ట్రాల్లో..
ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాల్లో పరీక్షల తేదీలు మార్చినప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి బేషజాలకు పోయి నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దని హితవు పలికారు. నవంబర్ 6న జరగనున్న TGPSC AEE (సివిల్) పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Uppal Bus Terminal | మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : మంత్రి పొన్నం