అక్షరటుడే వెబ్‌డెస్క్: US China AI War | ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత విషయంలో అమెరికా, చైనాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. ఏఐ రంగంలో ఏ ఒక్క దేశానికీ గుత్తాధిపత్యం ఉండే ప్రసక్తే లేదని చైనా తేల్చిచెప్పింది. ఏఐ అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, వివక్ష లేని వాతావరణాన్ని సృష్టించేందుకు అమెరికా తమతో కలిసి పనిచేయాలని చైనా అధికారిక పత్రిక ‘పీపుల్స్ డైలీ’ హితవు పలికింది. వచ్చే వారం జరగనున్న ఇరు దేశాల ఉన్నత స్థాయి చర్చల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
US China AI War | అసలు కారణం ఇదే..
ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ అభివృద్ధిలో అమెరికా, చైనాలు ప్రధాన శక్తులుగా కొనసాగుతున్నాయి. అయితే, ఏఐ విధానాలు , పరిశ్రమకు సంబంధించి ఇరు దేశాల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఉన్నాయి. అమెరికన్ ఏఐ ల్యాబ్‌ల మేధో సంపత్తిని (IP) చైనా సంస్థలు పెద్ద ఎత్తున దొంగిలిస్తున్నాయని అమెరికా ప్రభుత్వం ఇటీవల తీవ్ర ఆరోపణలు గుప్పించింది.
ఈ నేపథ్యంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ విదేశాంగ విధానాన్ని ప్రతిబింబించే ‘జోంగ్ షెంగ్’ అనే కలం పేరుతో పీపుల్స్ డైలీ ఒక ప్రత్యేక వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. మానవాభివృద్ధికి ఏఐ ఒక కొత్త మైలురాయి అని, దీనిని దేశాల మధ్య రాజకీయ ఆధిపత్య పోటీగా మార్చడం సరికాదని ఆ వ్యాసంలో స్పష్టం చేశారు.
US China AI War | డ్రాగన్ పత్రిక విమర్శలు..
తాము ఎల్లప్పుడూ ‘ఓపెన్ సోర్స్’ విధానాలనే ప్రోత్సహిస్తున్నామని, అమెరికా కంపెనీలు సైతం చైనాకు చెందిన ఓపెన్ సోర్స్ ఏఐ మోడళ్లను స్వేచ్ఛగా వాడుకోవచ్చని పత్రిక పేర్కొంది. అయితే, ఇదే విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించింది. అమెరికా సంస్థలు చిన్న మోడళ్ల శిక్షణ కోసం ‘డిస్టిలేషన్’ విధానాన్ని వాడితే సాధారణ విషయంగా చూసే ఆ దేశం.. అదే పని చైనా కంపెనీలు చేస్తే మాత్రం ‘మేధో సంపత్తి దొంగతనం’ అంటూ తప్పుపడుతోందని మండిపడింది.
ఏఐ రంగం మరింత పారదర్శకంగా, అందరికీ ప్రయోజనకరంగా ఉండేందుకు అమెరికాతో నిర్మాణాత్మక చర్చలకు సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. అయితే, చైనా తాజా వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఇది కూడా చదవండి: MLA Rakesh Reddy | రాజీనామా చేయడానికి సిద్ధం.. ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు