అక్షరటుడే వెబ్‌డెస్క్: US Iran Conflict | పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఒకవైపు శాంతి పునరుద్ధరణ కోసం చర్చలు జరుగుతుండగానే.. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. హర్మూజ్ జలసంధి ( Hormuz Strait) సమీపంలో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం దాడులకు తలపడ్డాయి.
US Iran Conflict | హర్మూజ్ వద్ద అమెరికా దాడులు..
హర్మూజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే ఇరాన్‌లోని కీలకమైన బందర్ అబ్బాస్ పోర్టు ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా తప్పుపట్టింది. అగ్రరాజ్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తోందని, ఇలాంటి దురాక్రమణలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) హెచ్చరించింది.

US Iran Conflict | అమెరికా బేస్‌లపై ఇరాన్ క్షిపణి ..
అమెరికా దాడులకు ఇరాన్ అంతే వేగంగా స్పందించింది. గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో ప్రతీకార దాడులు ప్రారంభించినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే తాము ఏ దేశంలోని అమెరికా బేస్‌లను టార్గెట్ చేశామనే వివరాలను మాత్రం ఇరాన్ అధికారికంగా వెల్లడించలేదు.

US Iran Conflict | క్షిపణులను అడ్డుకున్న కువైట్..
ఇరాన్ దాడుల ప్రకటనతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలంలోకి గుర్తుతెలియని డ్రోన్లు, క్షిపణులు దూసుకొచ్చినట్లు కువైట్ రక్షణ దళాలు వెల్లడించాయి. అయితే వాటిని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గాల్లోనే సమర్థవంతంగా కూల్చివేసినట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. ఈ తాజా ఘర్షణలతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
ఇది కూడా చదవండి: Siddaramaiah Resignation | మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తున్నా : సిద్దరామయ్య


