అక్షరటుడే వెబ్‌డెస్క్: Uttam Kumar Reddy SIR | ఓటరు జాబితా సవరణలో వెలుగు చూసిన అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ‘రిఫరీ’పైనే అనుమానం కలిగితే అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల సంఘం స్వతంత్రతే ప్రధాన పునాది అని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నీ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడే వరకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదని తేల్చిచెప్పారు.
Uttam Kumar Reddy SIR | ఓటు ప్రాథమిక రాజ్యాంగ హక్కు..
ఎన్నికల సంఘం బీజేపీ కార్యాలయం కాదని, ఓటరు జాబితా కేంద్ర ప్రభుత్వ ఆస్తినో లేదా అధికార పార్టీ సొత్తో కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఓటు అనేది దేశ ప్రజల ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని గుర్తుచేశారు. ఎన్నికల సంఘాన్ని బీజేపీ తన రాజకీయ పరికరంగా మార్చుకునే ప్రయత్నాన్ని సహించబోమన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి ప్రధానన్యాయమూర్తిని (సీజేఐ) ఎందుకు తొలగించారని ఆయన నిలదీశారు. ప్రధాని సూచించిన కేంద్ర మంత్రులను కమిటీలో చేర్చి, బీజేపీ కావాలనే తమ మెజారిటీని ఖాయం చేసుకుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గతంలో లేవనెత్తిన సందేహాలే నేడు దేశ ప్రజల ప్రశ్నలయ్యాయని, ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి లేవనెత్తినట్లు చెబుతున్న 14 అభ్యంతరాలపై ఈసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Uttam Kumar Reddy SIR | హక్కు చిన్నది కాదు..
గోవాలో 97 మంది అర్హుల పేర్లు తుది జాబితాలో చేరకపోవడం తీవ్ర ఆందోళనకరమని ఉత్తమ్ అన్నారు. చట్టబద్ధ అధికారి అర్హతను నిర్ధారించినప్పటికీ, సాఫ్ట్‌వేర్ ఓటు హక్కును అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. ఈ ఉదంతానికి బాధ్యులెవరో ఎన్నికల సంఘం దేశ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల సంఖ్య 97 కావచ్చు, ఆ సంఖ్య చిన్నదైనా ప్రతి ఒక్కరి ఓటు హక్కు మాత్రం చిన్నది కాదన్నారు. ఒక్క అర్హుడి ఓటు హక్కును అడ్డుకున్నా అది నేరుగా ప్రజాస్వామ్యంపై దాడేనని అభివర్ణించారు. మనిషి కోసం సాంకేతికత ఉండాలి తప్ప, సాంకేతికత కోసం ఓటు హక్కును బలి ఇవ్వకూడదని హితవు పలికారు. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా పేర్ల తొలగింపుపై పారదర్శకత అవసరమని, పశ్చిమ బెంగాల్‌లో 22.21 లక్షల మంది పేర్ల పునరుద్ధరణకు అప్పీలు చేయడం చిన్న విషయం కాదన్నారు.
Uttam Kumar Reddy SIR | ఓటింగ్‌కు ముందే న్యాయం..
ఎన్నికలు ముగిసిన తర్వాత పేరు సరిచేస్తే ప్రయోజనం ఏమిటని, ఓటింగ్‌కు ముందే బాధితులకు న్యాయం జరగాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రైలు వెళ్లిపోయిన తర్వాత టికెట్ ఇచ్చినట్లుగా.. ఎన్నికల తర్వాత ఓటు హక్కును పునరుద్ధరించడం ఏమిటని ప్రశ్నించారు. ‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవం’ అనే ఒక్క మాటతో కమిషనర్ల అభ్యంతరాలు మాయమైపోవని, వివాదాస్పద నిర్ణయాలను ఎవరు అనుమతించారో ఎన్నికల సంఘం బహిర్గతం చేయాలని కోరారు. గోవా ఘటనతో పాటు ఓటరు జాబితాల సాంకేతిక వ్యవస్థపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ ( Gyanesh Kumar )తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, గుడ్డిగా ఎన్నికల ప్రక్రియను నమ్మాలని ప్రజలను ఆదేశించలేరని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Congo Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. 14 మంది దుర్మరణం