అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sigachi Blast Compensation | సిగాచి పరిశ్రమలో పేలుడు కారణంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. ఈ ఘటన జరిగి నేటికి ఏడాది అవుతున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదిక పోస్ట్ చేశారు.
ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం, సిగాచి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు హరీశ్‌రావు నివాళి తెలిపారు. ఈ ప్రమాదంలో 54 మంది చనిపోయారని, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం తరఫున రూ.లక్ష మాత్రమే ఇచ్చారన్నారు. కంపెనీ ఇచ్చిన డబ్బులు బాధిత కుటుంబాలకు ముట్టజెప్పి, కోటి పరిహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Sigachi Blast Compensation | వాటిని కూడా..
కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బులను కూడా పరిహారంలో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు కష్టార్జితం నుంచి హక్కుగా వచ్చిన డబ్బును సైతం కంపెనీ జేబులో నుంచి ఇచ్చినట్లు చూపడం సరికాదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన కార్మికుల వైద్య ఖర్చులను కూడా ఈ అరకొర పరిహారంలోనే కోత విధించారని మండిపడ్డారు. క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందక, జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఇస్తానన్న ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. దీనిపై కార్మిక శాఖ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Sigachi Blast Compensation | ప్రమాదం కాదు
ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య అని హరీశ్‌రావు ఆరోపించారు. 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1777 హెచ్‌పీకి యంత్రాలను పెంచారన్నారు. సేఫ్టీ గార్డ్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీ లేదు, డస్ట్ కంట్రోల్ సిస్టమ్ పనిచేయలేదని పేర్కొన్నారు. ఇంత నిర్లక్ష్యం బయటపడినా, ప్రభుత్వం యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆనాడు మృతదేహాల సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం, పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులతో సంబంధం లేకుండా ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Rythu Bharosa Funds | నేడు అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా