అక్షరటుడే వెబ్‌డెస్క్: Vasan Eye Care Diwali | దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వల్ల కంటి గాయాల బారిన పడే 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల పిల్లల కోసం ఏఎస్జీ హాస్పిటల్స్ లిమిటెడ్‌లో భాగమైన వాసన్ ఐ కేర్ ‘సేఫ్ ఐస్, సేఫ్ దీపావళి’ (Safe Eyes, Safe Deepavali) పేరుతో ప్రత్యేక కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవ ద్వారా గాయపడిన పిల్లలకు ఉచిత ప్రథమ చికిత్స, అత్యవసర వైద్యం, మందులు , అవసరమైన చోట ఉచిత శస్త్రచికిత్సలను కూడా అందించనున్నారు.
Vasan Eye Care Diwali | 95కి పైగా నగరాల్లో ..
ఈ ప్రత్యేక వైద్య సేవలు 2026 నవంబర్ 4 నుండి నవంబర్ 14 వరకు 95కి పైగా నగరాల్లోని 200 కంటే ఎక్కువ వాసన్ ఐ కేర్ , ఏఎస్జీ ఐ హాస్పిటల్ కేంద్రాలలో లభిస్తాయి. బాధ్యతాయుతంగా పండుగ జరుపుకుంటూ ప్రతి చిన్నారి కంటి చూపును కాపాడటమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. అత్యవసర సేవలు , సమీపంలోని కేంద్రాల వివరాల కోసం 1800 5713 333 ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
Vasan Eye Care Diwali | తొలి కొన్ని గంటలే కీలకం..
గత ఏడాది దీపావళి సమయంలో వాసన్ , ఏఎస్జీ కేంద్రాలలో 500 మందికి పైగా గాయపడిన పిల్లలకు చికిత్స అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. పటాకుల వల్ల కంటి ముందు భాగం, కార్నియా దెబ్బతినే ప్రమాదం ఉందని, వెంటనే వైద్యం అందించకపోతే శాశ్వత అంధత్వం వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన తొలి కొన్ని గంటల్లోనే నిపుణులతో చికిత్స అందించడం చాలా కీలకమని ఏఎస్జీ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ అరుణ్ సింఘ్వీ , సీఓఓ డాక్టర్ కె. కమల్ బాబు స్పష్టం చేశారు.
Vasan Eye Care Diwali | జాగ్రత్తలు..
దీపావళి పండుగ సమయంలో పిల్లల కంటి భద్రత కోసం పలు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. పటాకులు కాల్చేటప్పుడు చేతితో పట్టుకోకుండా, అగర్బత్తీ సహాయంతో చేతి పొడవు దూరంలో ఉండి వెలిగించి వెంటనే వెనక్కి జరగాలని, అలాగే పిల్లలు , పెద్దలు తప్పనిసరిగా రక్షణ కళ్లద్దాలు (ప్రొటెక్టివ్ గ్లాసెస్) ధరించాలని స్పష్టం చేస్తున్నారు. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించాలని, వెలిగించే సమయంలో టపాసుపైకి వంగడం కానీ, సరిగ్గా పేలని టపాసు దగ్గరకు మళ్లీ వెళ్లడం కానీ అస్సలు చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు కంటికి గాయమైతే, ఆ కంటిని రుద్దడం లేదా నొక్కడం వంటివి చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Vasan Eye Care Diwali | ప్రమాదం జరిగితే ఏం చేయాలి?
కంటికి గాయమైనప్పుడు పసర్లు, కాటుక, చుక్కల మందులు వేయడం లేదా నీటి ధారతో కడగడం వంటి ఇంటి చిట్కాలు అస్సలు చేయవద్దు. కంటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా తేలికపాటి కవచంతో కప్పి, ప్రశాంతంగా ఉంచుతూ వెంటనే హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి దగ్గరలోని వాసన్ ఐ కేర్ లేదా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
ఇది కూడా చదవండి: Anganwadi Services | అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్ గరిమా అగ్రవాల్