అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HYDRAA | పార్కుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని మంజీరా కాలనీలో ఆక్రమణకు గురైన 577 గజాల పార్కు స్థలాన్ని మంగళవారం కాపాడింది.
గ్రామపంచాయతీ లేఔట్‌లో పార్కుగా చూపించిన స్థలాన్ని కొందరు తిరిగి విక్రయించారు. వాటిని కొనుగోలు చేసిన వారు ప్రహరీ నిర్మించి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీంతో కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు అది పార్కు స్థలంగా నిర్ధారించారు. మంగళవారం అక్కడ నిర్మించిన ప్రహరీలను తొలగించి పార్కు స్థలంగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
HYDRAA | చెంగిచెర్లలో..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల శ్రీ లక్ష్మీనగర్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన 639 చదరపు గజాల స్థలాన్ని సైతం హైడ్రా రక్షించింది. ఈ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించారు. గతంలో గ్రామ పంచాయతీ ఉన్న సమయంలో అక్కడ లే అవుట్ శేశారు. పార్కు కోసం స్థలం కేటాయించారు. అనంతరం దానిని విక్రయించారు. దీంతో కొన్న వారు ప్రికాస్ట్ వాల్స్ నిర్మించారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. పార్కు స్థలంలో నిర్మించిన ప్రహరీలను తొలగించింది.
HYDRAA | అక్రమ బోర్లపై..
అక్రమ బోర్లపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లాపూర్‌లో మంగళవారం కూడా హైడ్రా దాడులు నిర్వహించి 3 బోర్లతో పాటు.. 3 సంపులను ధ్వంసం చేసింది. అనుమతులు లేకుండా బోర్లు వేసి, వాటి ద్వారా ట్యాంకర్లతో అక్రమంగా నీటి దందా చేపడుతున్న వారిపై చర్యలు చేపట్టింది. తెల్లాపూర్‌లో సోమవారం 7 బోర్లు, 6 వాటర్ సంపులను తొలగించగా.. మంగళవారం మరో 3 బోర్లను పూడ్చి వేసింది.
దీనిని కూడా చదవండి : Agricultural Officer Bribery | రూ.20 వేల లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ అధికారి