అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Anganwadi Services| అంగన్వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) సూచించారు. రుద్రంగి మండలం మానాల అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Anganwadi Services | చిన్నారులతో ఆడుతూ.. పాడుతూ..
ముందుగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఎత్తు బరువును పరిశీలిస్తుండగా కలెక్టర్ తనిఖీ చేశారు. సామ్, మామ్ పిల్లలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రంలో ఆర్వో వాటర్ యంత్రం పనితీరు, ఫ్యాన్లు, లైట్లు పరిశీలించారు. అలాగే ప్రాథమిక పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తుండగా తనిఖీచేశారు. తరగతి గదులు సైతం పరిశీలించారు. ఈ సందర్భంగా పోషణమాసం ప్రాముఖ్యతను గర్భిణులు బాలింతలు పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. పిల్లలకు అన్నప్రాసన చేశారు. ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రాల సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు తదితర అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు.
Anganwadi Services | ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలకు..
ప్రతిరోజూ తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, దీంతో వారి బంగారు భవితకు బాటలు పడతాయని స్పష్టం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 10 వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, ఆరోగ్య కార్డులో నమోదు చేయాలని ఆదేశించారు. నీటిని వేడి చేసి.. చల్లార్చి తాగించాలని తెలిపారు. టాయిలెట్ వెళ్లిన తరువాత పిల్లలు చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
బాలామృతంతో పిల్లలకు ఇష్టమైన కేకులు, లడ్డూలు, బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలు తయారు చేసి ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఎదుగుదల లోపాలున్న పిల్లలు, చెవిటి, మూగ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆర్బీఎస్కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆస్పత్రిలో డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. అలాగే కరీంనగర్లో ఎన్ఆర్సీ కేంద్రంలో సేవలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి సంపత్ కుమార్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, తహశీల్దార్ పుష్పలత, సర్పంచ్ శంకర్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Agricultural Officer Bribery | రూ.20 వేల లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ అధికారి