అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Kaleshwaram Project Dispute | కాళేశ్వరంపై (Kaleshwaram) రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని అర్బన్ (Nizamabad) మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా(EX MLA Bigala Ganesh Gupta) అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించిన ఆయన అక్కడి నుంచి వీడియోలో మాట్లాడారు.
Kaleshwaram Project Dispute | మేడిగడ్డపై పసలేని ఆరోపణలు..
ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’ అంటూ దుష్ప్రచారం చేసి ప్రజల ఓట్లు దండుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బిగాల ఆరోపించారు. ఇప్పుడు మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉన్నప్పటికీ రైతులకు నీరు అందించడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించారు. ప్రాజెక్టుపై నాడు చేసిన ఆరోపణలకు, నేటి పరిస్థితులకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజలను నీటి వృథా చేయవద్దంటూ హెచ్చరిస్తూ, మరోవైపు రైతులకు సాగునీరు అందించకుండా పంటలు వేయడం మీ కర్మ అంటూ మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు.
Kaleshwaram Project Dispute | ఇతర రాష్ట్రాల కోసం తెలంగాణ హక్కులు..
తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాల్సిన బాధ్యతను విస్మరించి, ఇతర ప్రాంతాల ప్రయోజనాల కోసం తెలంగాణ నీటి హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నారా అని బిగాల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద అందుబాటులో ఉన్న నీటిని సాంకేతిక నిపుణుల సూచనలు, బ్యారేజీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి, సాధ్యమైన వెంటనే పంపులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్ సింగ్, దండు శేఖర్ జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: వర్షాలు లేక.. రేట్లు అమాంతం పెరిగాయి