Vijay Women Comments | మహిళలను కించపరిస్తే చట్టం ఊరుకోదు.. సీఎం విజయ్ సంచలన హెచ్చరిక

తమిళనాడులో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, అభ్యంతరకర ధోరణులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay Women Comments | తమిళనాడులో ( Tamil Nadu ) మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, అభ్యంతరకర ధోరణులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరిట ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని, ప్రతి ఒక్కరూ తమ ప్రవర్తనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నటి త్రిషను ఉద్దేశించి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో సీఎం విజయ్ ఈ అంశంపై పరోక్షంగా స్పందిస్తూ విపక్షాల విమర్శలకు దీటుగా బదులిచ్చారు.

Vijay Women Comments | ద్వందార్థాలు వచ్చే పదాలు..

అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. కొందరు నేతలు మాట్లాడేటప్పుడు ద్వందార్థాలు వచ్చే పదాలను ఉపయోగిస్తున్నారని, ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మన ఇళ్లలోనూ తల్లులు, అక్కాచెల్లెళ్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. మహిళలను అవమానించేలా మాట్లాడితే చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుపోతుందని హెచ్చరించారు. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్న ఆయన.. గతంలో ఇదే అసెంబ్లీలో జయలలిత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని, కానీ నోరుజారే ముందు ప్రజలు గమనిస్తున్నారనే స్పృహ ఉండాలని స్పష్టం చేశారు.

Vijay Women Comments | అవినీతిపై కఠిన వైఖరి..

రాష్ట్రంలో శాంతిభద్రతల లోపంపై వస్తున్న విమర్శలను సీఎం విజయ్ తిప్పికొట్టారు. పోలీస్ వ్యవస్థ కేవలం అరెస్టులు చేసేందుకు మాత్రమే కాదని, అది రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించేవారికి పోలీసులు మిత్రులుగా ఉంటారని, ఉల్లంఘించేవారికి సింహస్వప్నంగా మారుతారని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు లేదా అధికారులు ఎవరైనా సరే పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోకూడదని తేల్చిచెప్పారు. విమర్శల కంటే రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు.

అవినీతిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ఆయన.. అవినీతికి పాల్పడే అధికారుల కుటుంబాలు కూడా సమాజంలో తలదించుకునేలా కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. లాకప్ డెత్‌లు లేదా లాకప్ నేరాలు సాధారణమైనవి కావని, ఇలాంటి ఘటనలపై మేజిస్ట్రేట్ ద్వారా పూర్తిగా పారదర్శక విచారణ జరిపిస్తామని సీఎం విజయ్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:  Municipal Worker Protest | వాటర్​ ట్యాంక్​ ఎక్కి మున్సిపల్ కార్మికుడి నిరసన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *