అక్షరటుడే, వెబ్‌డెస్క్: Viksit Bharat Mission | రానున్న 20 ఏళ్లలో వికసిత్ భారత్ నిర్మిస్తామని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, ఉత్తరాల నుంచి సోషల్ మీడియాలో సందేశాల వరకు మార్పులు చూశామన్నారు. ఈ పరిణామాల్లో తొలి ఐఐటీగా ఖరగ్‌పూర్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్ తన 100వ వార్షికోత్సవాన్ని జరుపుకునే సమయానికి, భారతదేశం ఒక ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్)గా ఉండాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. 1925 నుండి 1927 మధ్యకాలంలో, ఇదే నేలపై స్వాతంత్ర్య సమరయోధులుగా బందీలుగా ఉన్నవారు స్వాతంత్ర్యం సాధించాలని ప్రతిజ్ఞ చేశారని, 20 ఏళ్లలోనే దానిని సాధించారని గుర్తు చేశారు. నేడు, మనం కూడా అటువంటిదే ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్నారు. రాబోయే 20 ఏళ్లలో మనం ‘వికసిత్ భారత్’ను నిర్మిస్తామని పేర్కొన్నారు.
Viksit Bharat Mission | చిప్‌ల నుంచి షిప్‌ల వరకు..
చిప్ నుండి షిప్ వరకు అన్నీ ఇక్కడే తయారవుతాయని ప్రధాని అన్నారు. యువత చేతుల మీదుగానే ఇవన్నీ సాధ్యమవుతాయని తెలిపారు. తాను సెమీ కండక్టర్ల మిషన్ ప్రారంభించినప్పుడు అనేక విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం భారత్ ఇతర దేశాలకు చిప్‌లను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందన్నారు. నాలుగేళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా అనేక సెమీకండక్టర్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.
Viksit Bharat Mission | దేశ నిర్మాణంలో కీలక పాత్ర
ఐఐటీ ఖరగ్‌పూర్ తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి చాలా కాలం కాలేదన్నారు. అప్పటికీ మొదటి సాధారణ ఎన్నికలు కూడా జరగలేదని చెప్పారు. ఆ సమయంలో, దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పనకు ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉండేది. ఆ కొరత తీర్చడంలో ఐఐటీ పాత్ర కీలకమని కొనియాడారు. ప్రతి కాలంలోనూ, దేశ నిర్మాణంలో తమ బాధ్యతను నెరవేర్చడంలో ఈ సంస్థ ముందుండి నడిచిందన్నారు.
ఇది కూడా చదవండి..: Missing Woman Traced | ఐదేళ్ల క్రితం మహిళ అదృశ్యం.. ఏఐ సాయంతో గుర్తించిన పోలీసులు