YS Jagan | రాష్ట్రంలో రెడ్​ బుక్​ రాజ్యాంగం: వైఎస్​ జగన్​

ఏపీలో రెడ్​బుక్​ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ ఆరోపించారు. తాడెపల్లిగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీలో రెడ్​బుక్​ రాజ్యాంగం నడుస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ ఆరోపించారు. తాడెపల్లిగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ లాకప్​ డెత్​పై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తమ హయాంలో సంక్షేమం గురించి చర్చ జరిగిందని జగన్​ అన్నారు. చంద్రబాబు పాలనలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, కస్టోడియల్‌ డెత్‌ మీద చర్చ జరుగుతోందని విమర్శించారు. రూల్‌ ఆఫ్‌ లా పక్కకుపోయి.. రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ రాజ్యమేలుతోందన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

YS Jagan | ఎన్ని అరాచకాలు చేశారో..

కృష్ణలంక పోలీస్​ స్టేషన్​లో సీసీ ఫుటేజ్‌ లేదని రిమాండ్‌ రిపోర్టులో చెప్పారని జగన్​ పేర్కొన్నారు. 18 నెలలుగా ఠాణాలో సీసీ కెమెరా ఫీడ్‌ లేదన్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు సీసీ ఫుటేజ్‌ డిలీట్‌ చేయడం కుదురుతుందా అని ప్రశ్నించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న ఫీడ్‌ ఏమైందన్నారు. 18 నెలల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో అని అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రధాన కూడళ్లలో సీసీ ఫుటేజ్ ఏమైందని జగన్​ నిలదీశారు. మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవచ్చు కదా అన్నారు. సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదని ప్రశ్నించారు.

YS Jagan | చంద్రబాబు కాపాడుతాడు

ys jagan

సీఐని సీపీ కాపాడుతారని, సీపీని డీజీపీ, డీజీపీని చంద్ర‌బాబు కాపాడుతారని జగన్​ విమర్శించారు. రాష్ట్రంలో కుప్ప‌కూలిపోయిన వ్య‌వ‌స్థ‌కు ఇది సాక్ష్యం అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో చట్టం, న్యాయం లేదని, కోర్టులతో తమకు పనిలేదని, దొంగ కేసులు పెడతామని, చివరికి బూడిద కూడా ఇవ్వము అని అధికారిక‌ ప్రకటన చేయగలరా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కస్టడీ తీసుకొని, టార్చర్ చేసి, సీసీ ఫుటేజీ మాయం చేసి, చివ‌రి ఆ త‌ల్లికి బూడిద కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

YS Jagan | ఎదురు దాడి

రాష్ట్ర రాజధానిలో ఓ వ్యక్తిని లాకప్​ డెత్​ చేశారంటే.. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉందోనని వైఎస్​ జగన్​ ఆందోళన వ్యక్తం చేశారు. సాయికృష్ణ కుటుంబాన్ని తాను పరామర్శించే వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. పోలీసుల తీరుపై ప్రశ్నిస్తే రౌడీలకు మ‌ద్ద‌తు చేస్తారా అని ఎదురుదాడి చేయ‌డ‌మే కాకుండా.. ఎల్లో మీడియాలో రాత‌లు రాయిస్తున్నారని మండిపడ్డారు.

YS Jagan | రాజధాని రైతులు కలిశారు

రాజధాని రైతులంతా ఇటీవల తనను కలిశారని వైసీపీ అధినేత తెలిపారు. రైతులంతా తమ గోడు చెప్పుకోవడంతో, వారి కోరిక అమరావతిలో తమ పార్టీ నేతలు పర్యటించారని చెప్పారు. అయితే తమ పార్టీ నాయకులపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలపై దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టారన్నారు.

ఇది కూడా చదవండి : Afghanistan Airstrikes | పాక్​పై అఫ్గానిస్థాన్ వైమానిక​ దాడులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *