అక్షరటుడే వెబ్‌డెస్క్: 22A Property Issue | 22ఏ (22A) నిబంధన వల్ల ప్రైవేట్ ఆస్తులకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమేనని, ఈ వివాదాన్ని దాచిపెట్టాలని లేదా ప్రజలను మభ్యపెట్టాలని ప్రభుత్వం ఎప్పుడూ భావించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )స్పష్టం చేశారు. జరిగిన పొరపాటును భేషరతుగా సరిదిద్దుతామని, ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ తెలిపారు.
22A Property Issue | హరీశ్ రావు ఆరోపణలపై కౌంటర్..
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆస్తులను 22ఏలో పెట్టి డబ్బులు వసూలు చేస్తోందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను పొంగులేటి తీవ్రంగా ఖండించారు. హరీశ్ రావు ‘అబద్ధాల రావు’గా మారారని ఎద్దేవా చేశారు. తప్పు జరిగిందని స్వయంగా తానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పానని, ఆయన తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత ఉన్నందువల్లే తప్పును అంగీకరించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా దబాయించలేదని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వల్ల ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించని వారు తమ గురించి మాట్లాడటం సరికాదన్నారు.
22A Property Issue | అసలు కారణం ఇదే..
1998 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ జీవోలు, మెమోలతో హక్కులు పొందిన భూముల కాపీలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాలేదని పొంగులేటి వివరించారు. ఈ విషయాన్ని గ్రహించకుండా హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లు 22ఏ జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. దీనిని గుర్తించి యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
22A Property Issue | కమిటీ ఏర్పాటు..
హైదరాబాద్ కోర్ ఏరియాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 22A బాధితుల ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఆస్తుల విషయంలో జరిగిన పొరపాటును ఈ నెలాఖరులోపు పరిష్కరించాలని ఉన్నతాధికారులను కఠినంగా ఆదేశించినట్లు తెలిపారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ లోకేశ్, రాజీవ్ గాంధీతో పాటు మరో ముగ్గురితో కలిపి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీ రాబోయే 15 రోజుల పాటు ప్రతిరోజూ నిజమైన భూ హక్కుదారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ స్లాట్స్ షార్ట్ ఫాల్ అయితే వాటిని పొడిగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kavitha Bhumi Lakshmi Scheme | పేదలకు ఎకరం భూమి ఇస్తాం.. కవిత సంచలన ప్రకటన