Kavitha Bhumi Lakshmi Scheme | పేదలకు ఎకరం భూమి ఇస్తాం.. కవిత సంచలన ప్రకటన

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Bhumi Lakshmi Scheme | తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి పథకం’ కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని నేత కవిత సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం లావాదేవీలే కావొచ్చు కానీ, పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచప్రాణాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు జరిగినా ముందుగా తీసుకుంటున్నవి అసైండ్ భూములేనని ఆమె మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kavitha Bhumi Lakshmi Scheme | భూదోపిడీ సాగుతోంది..

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగుతోందని కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్లు భూ దొంగలని, అనగనగా ఒక రాజు ఏడుగురు కొడుకులు అన్నట్లుగా వారి భూదోపిడీ సాగుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల పాలన సాగుతోందని, ఇంతమంది రాజ్యాంగేతర శక్తుల దోపిడీ ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం సుమారు 30 వేల ఎకరాల అసైండ్ భూములను లాగేసుకుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో చెప్పినట్లుగా పేదల అసైండ్ భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని సవాల్ విసిరారు.

Kavitha Bhumi Lakshmi Scheme ? మేకవన్నే పులిలా రేవంత్ రెడ్డి..

గత 31 నెలల్లో ఎనాడూ సామాజిక న్యాయం పదం ఉచ్ఛరించని ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్ రెడ్డి ‘సామాజిక అన్యాయం’ అనబోయి ‘సామాజిక న్యాయం’ అన్నారని, ఆయన మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లోనే సామాజిక న్యాయం లేదని, పదవులు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు. రేవంత్ రెడ్డి మేకవన్నే పులిలాంటి వారని విమర్శించారు.

ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లో బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సలహాదారులుగా నియమితులైన వారిలో బీసీ వర్గానికి చెందిన నేత జీతం ఇతరులకంటే ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. ఆర్టీఐ కమిషనర్ల నియామకంలోనూ ఒక్క బీసీకి కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం కొనసాగుతోందని కవిత విమర్శించారు.

 

ఇది కూడా చదవండి: KBR Park One Way | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానం అమలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *