అక్షరటుడే, వెబ్‌డెస్క్: 8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Govt Employees), పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సవరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా బేసిక్ పే భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా వేతనాల పెంపు, అలవెన్సులు, పెన్షన్ల సవరణ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలను సేకరించేందుకు జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని బృందం రాష్ట్రాలలో పర్యటిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, పెన్షనర్లతో మాట్లాడి వారి సమస్యలను రికార్డు చేయనున్నారు. వేతన సవరణపై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు.
8th Pay Commission | హైదరాబాద్‌లో రెండు రోజులు..
ఎనిమిదో వేతన సవరణ కమిషన్ సభ్యులు ఈనెల 18, 19 తేదీల్లో హైదరాబాద్ (Hyderabad) పర్యటించనున్నారు. వారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై నేరుగా వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ కమిషన్ సభ్యులు పర్యటించనున్నారు. అయితే ఇంకా తేదీలు ఖరారు కాలేదు. వేతనాల పెంపుతోపాటు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కమిషన్ ముందు తమ డిమాండ్లను ఉంచేందుకు ఉద్యోగ సంఘాలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
8th Pay Commission | వచ్చేనెలలో జమ్మూలో..
కమిషన్ ప్రతినిధులు వచ్చేనెల 1 నుంచి 4 వరకు శ్రీనగర్‌లో, జూన్ 8న లద్దాఖ్‌లో పర్యటిస్తారు. ఆ ప్రాంతాల్లో పనిచేస్తున్న రక్షణ రంగం, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు.
8th Pay Commission | వేతనం ఎంత పెరగొచ్చంటే..
ప్రస్తుత ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుంటే కనీస వేతనం రూ. 18 వేలనుంచి రూ. 51,480 వరకు పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మొత్తం 18 లెవల్స్‌లో ఉండే ఉద్యోగులందరికీ వారి కేడర్‌ను బట్టి వేతనాల పెంపు ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 50 లక్షల మంది ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి..: Stalin Election Defeat | డీఎంకేకు షాక్.. సీఎం స్టాలిన్ ఓటమి

