Rajasekhar Reddy Arrest | రాప్తాడులో రాజకీయ కలకలం.. వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్, ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasekhar Reddy Arrest | అనంతపురం జిల్లా (Anantapur District) రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, పార్టీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు (Rural Police) మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసులో జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు అధికారికంగా వెల్లడించారు.

Rajasekhar Reddy Arrest | ఆత్మహత్య కేసులో అరెస్ట్

ఈ కేసు 2025లో జరిగిన ఓ విషాద ఘటనకు సంబంధించినది. తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రారంభంలో ఇది సాధారణ ఆత్మహత్య కేసుగా కనిపించినప్పటికీ, తర్వాత వచ్చిన ఆరోపణలు కేసుకు కొత్త మలుపు తిప్పాయి. మృతుడు మహేశ్వర్ రెడ్డి గతంలో సోషల్ మీడియా వేదికగా అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టినట్లు సమాచారం. ఆ పోస్టుల నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Rajasekhar Reddy Arrest | ప్రాథమిక ఆధారాల ఆధారంగా

మహేశ్వర్ రెడ్డి తండ్రి మలిరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించారు. తన కుమారుడిని తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా బెదిరించారని, ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేకనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి కొన్ని ఆడియోలు, వీడియోలు కూడా పోలీసులకు అందజేసినట్లు సమాచారం.

ఈ డిజిటల్ ఆధారాలు కేసు విచారణలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో ఈ కేసును రైల్వే పోలీసులు (Railway Police) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం కేసు తీవ్రత, ఆరోపణల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని అనంతపురం రూరల్ పోలీసులు, రాప్తాడు పోలీసులు (Raptadu Police) సంయుక్తంగా లోతైన విచారణ చేపట్టారు. విచారణలో లభించిన ప్రాథమిక ఆధారాల ఆధారంగా మంగళవారం ఉదయం తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు బోల్తా.. ప్రయాణికులకు గాయాలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *