అక్షరటుడే వెబ్‌డెస్క్:Mudiraj BC-A Demand | తెలంగాణలో జనాభా పరంగా అత్యంత పెద్ద కులమైన ముదిరాజ్‌లకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత దక్కడం లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజ్‌లను బీసీ-డీ (BC-D) కేటగిరీ నుంచి బీసీ-ఏ (BC-A) కేటగిరీకి మార్చాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్ జలవిహార్‌లో ‘ముదిరాజ్ విద్యావంతుల వేదిక’ ఆధ్వర్యంలో “ముదిరాజ్ సింహవాలోకనం” కార్యక్రమం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mudiraj BC-A Demand | ఇతర కులాలను కలుపుకొని..
రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా 7.46 % గా ఉందన్న ఈటల.. దాదాపు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే శక్తి ఉన్నప్పటికీ, రాజకీయంగా ఈ కులానికి ఎందుకు గుర్తింపు లభించడం లేదో అందరూ ఆలోచించుకోవాలన్నారు. పార్టీలకతీతంగా జాతి హక్కుల కోసం తీవ్రంగా పోరాడితే కచ్చితంగా అధికారం దక్కుతుందని, సమాన హక్కుల కోసం సమాన ఆలోచనలు ఉన్న ఇతర కులాలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
Mudiraj BC-A Demand | అందినట్లే అంది దూరమైన రిజర్వేషన్..
కుల సంఘాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఒకే తాటిపైకి రావాలని ఈటల విజ్ఞప్తి చేశారు. గతంలో అసెంబ్లీ వేదికగా ముదిరాజ్‌లను బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలని తానే మొదటిసారి మాట్లాడినట్లు గుర్తుచేశారు. “2008 ఉప ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. అది అందినట్లే అంది చేజారిపోయింది. గతంలో ఒకసారి అమలు జరిగి ఆగిపోయిన ప్రక్రియ కాబట్టి, ప్రభుత్వం దీనిని పునఃపరిశీలించి ముదిరాజ్‌లను వెంటనే బీసీ-ఏ లోకి చేర్చాలి” అని ఈ వేదిక ద్వారా ఆయన డిమాండ్ చేశారు.
Mudiraj BC-A Demand | సంఘాలపై పార్టీ ముద్రలు వేస్తున్నారు..
ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో కేవలం డబ్బున్న వారు మాత్రమే ఎమ్మెల్యేలు, ఎంపీలు కాగలుగుతున్నారని, సామాన్యులకు ప్రజాసేవ చేసే అవకాశం దక్కడం లేదని ఈటల విమర్శించారు. జనాభా ప్రాతిపదికన పదవులు, వాటాలు దక్కాలనే స్పృహ రాజకీయ పార్టీలకు, ప్రభుత్వ పెద్దలకు ఉండాలన్నారు. కుల సంఘాలను కూడా రాజకీయ పార్టీల ముద్ర వేసి నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.”పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అనే నినాదాన్ని గుర్తుంచుకుని మన హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి. రాజకీయాలు, పార్టీలు ఏవైనా కావచ్చు.. జాతి మనుగడ కోసం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నేను ఎప్పుడూ ముందుంటాను. గతంలో ఎంఆర్‌పీఎస్ (MRPS) ఉద్యమంలోనూ నేను భాగస్వామినయ్యాను అని అన్నారు”.
ఇది కూడా చదవండి: RTC Driver Removal | వడ్లు కొనమన్నందుకు.. ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల్లో నుంచి తీసేశారు!