Gujarat Incident | భార్య నచ్చలేదని రూ.50 వేలకు అమ్మేసిన భర్త.. గుజరాత్‌లో దారుణ ఘటన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gujarat Incident | గుజరాత్ (gujarat) రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తనకు నచ్చలేదనే కారణంతో కట్టుకున్న భర్తే ఆమెను డబ్బుల కోసం అమ్మేయడం సంచలనం సృష్టించింది.

ఈ అమానుష ఘటనలో ప్రధాన నిందితుడు నిఖేష్‌భాయ్ పటేల్‌తో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. మే 11న నిఖేష్ పటేల్ తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటన జరిగిన రెండు రోజులకే నిఖేష్ కూడా అదృశ్యమవ్వడంతో అతని తండ్రి మరో ఫిర్యాదు నమోదు చేశారు. వరుసగా జరిగిన ఈ పరిణామాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

Gujarat Incident | ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌కపోవ‌డంతో..

టెక్నికల్ సర్వైలెన్స్, మొబైల్ కాల్ డేటా, మానవ వనరుల ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు చివరకు నిఖేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రారంభంలో తప్పుడు కథలు చెప్పిన నిందితుడు.. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజాన్ని బయటపెట్టాడు. తన భార్య ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నానని నిఖేష్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితులు సంజయ్ ఠాకూర్, అశోక్ ఠాకూర్, సచిన్ దర్బార్‌ల సహాయంతో బాధితురాలిని రూ.50 వేలకే అమ్మేశామని అంగీకరించాడు. ఈ వ్యవహారంలో మరికొందరు కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Gujarat Incident | కాపాడిన పోలీసులు

నిందితుల చెర నుంచి బాధితురాలిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. తనను బలవంతంగా ఒకచోట బంధించి, నిరంతరం లైంగిక దాడులకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. అంతేకాకుండా తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కూడా లాక్కొని అమ్మేశారని వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్, అపహరణ, లైంగిక దాడి, మోసం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులో అరెస్టైన వారిని కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం కస్టడీకి తరలించినట్లు సమాచారం.

ఇక ప్రధాన నిందితుడు నిఖేష్ పటేల్‌కు Nikesh Patel ఇదివరకే వివాహం జరిగిందని, మహిళలను మోసం చేయడం, వారిని లోబరుచుకోవడం, కిడ్నాప్‌లకు పాల్పడటం వంటి పాత నేర చరిత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : France Abuse Case | ఫ్రాన్స్‌లో దారుణం.. ప్రేయసిని 487 మందికి అమ్మేసిన బ్యాంక్ మేనేజర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *