Fake Cotton Seeds | భారీగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

మల్కాజ్‌గిరి పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fake Cotton Seeds | హైదరాబాద్ (Hyderabad) తిరుమలగిరిలో మల్కాజ్‌గిరి పోలీసులు భారీ ఆపరేషన్​ చేపట్టారు. గుజరాత్ నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ పేరుతో విక్రయిస్తున్న రూ.30 లక్షల విలువైన 2,000 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వానాకాలం సాగు సీజన్​ ప్రారంభం అయింది. దీంతో అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే నకిలీ విత్తనాలు మార్కెట్​ను ముంచెత్తాయి. కొందరు డీలర్లు లాభాల కోసం రైతులకు కల్తీ విత్తనాలు అంటగడుతున్నారు. దీంతో అవి మొలకెత్తక రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో మల్కాజ్​గిరి పోలీసులు (Malkajgiri Police) ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టి శుక్రవారం నకిలీ విత్తనాల ముఠాను అరెస్ట్ చేశారు.

Fake Cotton Seeds | విత్తన కంపెనీ ఫిర్యాదుతో..

హైదరాబాద్‌కు చెందిన ఒక విత్తన వ్యాపారి, లాభాలు ఆర్జించడానికి గుజరాత్‌కు చెందిన ఒక పేరున్న కంపెనీ పేరుతో ఈ విత్తనాలను విక్రయించాలని పథకం వేశాడు. నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ (Narmada Sagar Agri Seeds)  పేరుతో కల్తీ విత్తనాలు అమ్ముతున్నాడు. అయితే సదరు కంపెనీ తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ మేనేజర్ సోలంకే యశ్వంత్ రావు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దాడులు చేసినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి తెలిపారు.

Fake Cotton Seeds | పక్కా సమాచారంతో..

న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏరువ బాలషోరెడ్డి అలియాస్ శివ రెడ్డి తమ కంపెనీ ప్యాకెట్లను పోలిన నకిలీ విత్తన ప్యాకెట్లను అక్రమంగా ముద్రించి, అనుమతులు లేకుండా విక్రయించాలని భావించారని ఫిర్యాదుదారు ఆరోపించారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు బోయిన్​పల్లి కూరగాయల మార్కెట్ యార్డ్ వద్ద ఒక మారుతి ఈకో వ్యాన్‌ను అడ్డగించారు. బాలషో రెడ్డితో పాటు కపర్తి బెంజిమెన్, దొంగ శ్రీను 12,800 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Fake Cotton Seeds | కార్యాలయంపై దాడి

పోలీసులు బండ్లగూడలోని న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ కార్యాలయంపై దాడి చేసి, రైతుల నుండి సేకరించిన సుమారు 2,000 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నకిలీ ప్యాకెట్లలో ప్యాక్ చేసి, అసలైనవిగా విక్రయించడానికి ఉద్దేశించినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఈ ప్యాకెట్ల డిజైన్లను గ్రాఫిక్ డిజైనర్ దొంగ శ్రీను రూపొందించగా, మేడ్చల్ జిల్లాలోని బహదూర్‌పల్లిలో ఉన్న ఒక ప్రైవేట్ ప్రింటింగ్ యూనిట్‌లో వాటిని ముద్రించినట్లు పోలీసులు తెలిపారు.

బాలషో రెడ్డిపై గతంలో సైతం నకిలీ విత్తనాల కేసులు ఉన్నాయి. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులను రైతు సంపద సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏరువ బాలషో రెడ్డి అలియాస్ శివ రెడ్డి (32), నిజామాబాద్ జిల్లాకు చెందిన సేల్స్ ఆఫీసర్ కపర్తి బెంజిమెన్ (28), జీడిమెట్లకు చెందిన మల్టీ-కలర్ ప్రెస్ డిజైనర్ దొంగ శ్రీను (48)గా గుర్తించారు.

దీనిని కూడా చదవండి : Ponguleti Srinivasa Reddy | ‘ఎస్ఐఆర్’ పెద్ద భూతం.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *