అక్షరటుడే వెబ్డెస్క్: Supreme Court Judges | దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఖాళీల భర్తీకి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా, ఒకరు సుప్రీంకోర్టు( Supreme Court) సీనియర్ న్యాయవాది కావడం గమనార్హం. ఈ నియామకాలకు సంబంధించిన వివరాలను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా సుప్రీంకోర్టులో గరిష్ట న్యాయమూర్తుల సంఖ్యను (Sanctioned Strength) 34 నుండి 38కి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాజాగా ఐదుగురు జడ్జీల రాకతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత వారం పంపిన సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
Supreme Court Judges | నియమితులైన న్యాయమూర్తులు వీరే..
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్న వారిలో పలు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు ఒక సీనియర్ న్యాయవాది ఉన్నారు. పంజాబ్ & హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ శీల్ నాగు, బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ సచ్దేవా, అలాగే జమ్మూ కాశ్మీర్ & లడఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరుణ్ పల్లి అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా సేవలందిస్తున్న వి. మోహన కూడా నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Supreme Court Judges | 12వ మహిళా జడ్జీగా వి. మోహన రికార్డు..
ఈ నియామకాల్లో సీనియర్ అడ్వకేట్ వి. మోహన ఎంపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2015లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా హోదా పొందిన ఆమె.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక హిజాబ్ వివాదం, సాయుధ దళాల్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించడం వంటి కీలక కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు. తాజా నియామకంతో సుప్రీంకోర్టు చరిత్రలోనే 12వ మహిళా న్యాయమూర్తిగా కావడం విశేషం. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న జస్టిస్ బి.వి. నాగరత్నతో కలిపి, అత్యున్నత న్యాయస్థానంలో సేవలందిస్తున్న ఇద్దరు మహిళా జడ్జీలలో ఈమె ఒకరిగా నిలవనున్నారు. న్యాయవాద వృత్తి (బార్) నుండి నేరుగా సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి పొందడం వల్ల ఈమెకు దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ పదవీకాలం లభించనుంది.
ఇది కూడా చదవండి: Heatwave Relief | ప్రజలకు గుడ్న్యూస్.. తగ్గనున్న ఎండలు


