అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cooler Electric Shock | ఇనుప కూలర్ రెండు ప్రాణాలను బలి తీసుకుంది. నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా (Nirmal District)లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. కూలర్, ఫ్యాన్ లేకపోతే ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు కూలర్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇనుప కూలర్ ఓ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చల్లగాలి కోసం కూలర్లో నీళ్లు పోస్తున్న మహిళకు కరెంట్ షాక్ కొట్టింది. ఆమెను కాపాడబోయిన భర్త, వారిద్దరిని రక్షించడానికి వెళ్లిన కుమారుడు మృతి చెందాడు. ఈ ఘటనటలో తండ్రీకొడుకులు మృతి చెందాగా.. మహిళ తీవ్ర గ్రాయాలతో బయట పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం (Pembi Mandal) కొరకంటితండాలో చోటు చేసుకుంది.
Cooler Electric Shock | కాపాడబోయి..
తండాకు చెందిన రాథోడ్ అర్జున్(56) భార్య సోనాబాయి దంపతులకు కుమారులు శ్రీనివాస్(25), సుభాష్ ఉన్నారు. ఆదివారం రాత్రి సోనాబాయి ఇంట్లో ఉన్న ఇనుప కూలర్లో నీళ్లు పోయడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెకు కరెంట్ షాక్ కొట్టింది. ఆమె కేకలు వేయడంతో భర్త అర్జున్ వచ్చి పక్కకు నెట్టేశాడు. ఆమె పక్కకు పడిపోయినా.. కూలర్ (Cooler) కిందపడి దాంట్లోని నీరు నేలపై పడ్డాయి. దీంతో అర్జున్‌కు కరెంట్ షాక్ తగిలింది. కళ్ల ముందే తల్లిదండ్రులు విద్యుత్ షాక్‌కు గురి కావడంతో పెద్ద కుమారుడు శ్రీనివాస్ కాపాడటానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి షాక్ కొట్టింది. దీంతో అర్జున్, శ్రీనివాస్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనాబాయిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Cooler Electric Shock | జాగ్రత్తగా ఉండాలి
ఇనుప కూలర్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎక్కడైన వైరు తేలిన కూలర్ మొత్తం షాక్ కొడుతుంది. సీజన్ ప్రారంభంలోనే మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి వైరింగ్ చెక్ చేయించుకోవాలి. కూలర్ లోపల విద్యుత్ వైర్లకు అతుకులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఆఫ్ చేసిన తర్వాతే నీళ్లు పోయాలి. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఇనుప కూలర్ల దగ్గరకు వెళ్లనీయొద్దు. కూలర్‌కు ఎర్తింగ్ వచ్చినా.. విద్యుత్ షాక్ వస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా మరమ్మతులు చేయించాలి.
ఇది కూడా చదవండి..: Telangana Formation Day | అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలు : వి.హన్మంత్ రావు


