అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Financial Crisis | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
బండి సంజయ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంటో మనకు తెలుసన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఏవిధంగా దిగజారిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
Telangana Financial Crisis | బీఆర్ఎస్ పాలనలో దోపిడీ
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సంపద మాత్రమే పెరిగిందన్నారు. లక్షల కోట్ల ఆస్తులు సంపాదించారన్నారు. బీజేపీతోనే తెలంగాఱ ఏర్పడిందని పేర్కొన్నారు. 1400 మందిని బలి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పార్లమెంట్లో సుష్మాస్వరాజ్ (Sushma Swaraj) తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు.
Telangana Financial Crisis | చేతకాకపోతే చెప్పు
రేవంత్ రెడ్డి (Revanth Reddy) నీకు మహారాష్ట్ర సీఎంతో అపాయింట్‌మెంట్ తీసుకోవడం చేతకాకపోతే మాకు చెప్పు అని కేంద్ర మంత్రి అన్నారు. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిందన్నారు. ఇప్పుడు తుమ్మిడిహెట్టి విషయంలో సైతం చర్చిస్తే సహకరిస్తుందని పేర్కొన్నారు. అయితే ఆ రాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, కిషన్ రెడ్డి ఇప్పించాలని రేవంత్రెడ్డి కోరుతున్నారని చెప్పారు. ఆయనకు చేతకాకపోతే తాము అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామన్నారు.
Telangana Financial Crisis | ఢిల్లీకి మూటలు
రాష్ట్ర ప్రభుత్వం (State Government) దగ్గర రూపాయి బిల్ల లేదని బండి అన్నారు. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ డబ్బుల్లేని పరిస్థితి ఉందన్నారు. పీఆర్సీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడవడమే కష్టంగా ఉందని.. అయినా కూడాఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు.
Telangana Financial Crisis | ఏపీలో నీతిమంతమైన పాలన
బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి అన్నారు. పక్కనే ఉన్న ఏపీలో మోదీ (PM Modi) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నీతిమంతమైన పాలనతో, కేంద్ర నిధులను వాడుకుంటూ దూసుకెళ్తోందని కొనియాడారు. తెలంగాణలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా అవినీతిమయంగా మారాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కలెక్షన్, కమీషన్ అని విమర్శించారు.
ఇది కూడా చదవండి..: Telangana Global Gateway | గ్లోబల్ గేట్వేగా తెలంగాణ : సీఎం రేవంత్రెడ్డి


