Telangana University Registrar | తెయూలో హైడ్రామా..: రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించని వైస్​ ఛాన్స్​లర్​

తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు, పరిపాలనా పరమైన లోపాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Registrar | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు, పరిపాలనా పరమైన లోపాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. మూడేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ యాదగిరి తన పదవికి రాజీనామా చేయడం విశ్వవిద్యాలయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. అసలు ఈ రాజీనామా వెనుక ఉన్న కారణాలు ఏమిటని సర్వత్రా చర్చనీయాంశమైంది.

Telangana University Registrar |ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎదుటే..

ఎస్సీ, ఎస్టీ కమిషన్(SC, ST Commission) ఛైర్మన్ వెంకటయ్య బుధవారం యూనివర్సిటీకి వచ్చారు. చైర్మన్ ముందే రిజిస్ట్రార్ మార్పు అంశంపై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. యాదగిరి రిజిస్ట్రార్​గా ఇంకెన్నేళ్లు ఉంటారని పలువురు ప్రశ్నించారు. ‘నన్ను రిజిస్ట్రార్ పదవి నుంచి తొలగించాలని నేనే స్వయంగా వైస్ ఛాన్సలర్​ను కోరుతున్నప్పటికీ, ఆయన స్పందించడం లేదు’ అని ప్రొఫెసర్ యాదగిరి స్వయంగా ఛైర్మన్ వెంకటయ్య ఎదుట వాపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలైంది. ఉన్నత విద్యాసంస్థలో రిజిస్ట్రార్ స్థాయి అధికారి బహిరంగంగా ఇలా మాట్లాడటంపై విమర్శలు వచ్చాయి. తీవ్ర ఒత్తిడి, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నేపథ్యంలోనే ప్రొఫెసర్ యాదగిరి తన పదవికి బుధవారం సాయంత్రమే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Telangana University Registrar | 2014 నియామకాల నేపథ్యంలో..

యూనివర్సిటీలో 2014లో అధ్యాపకుల నియామకాల వివాదం చాలా ఏళ్లుగా న్యాయస్థానాల్లో నలుగుతోంది. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై యూనివర్సిటీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదనే వాదనలు ఉన్నాయి. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, 2014 ఏడాది నియామకమైన అధ్యాపకులకు ప్రమోషన్లు కల్పించేందుకు రిజిస్ట్రార్ అత్యుత్సాహం ప్రదర్శించారనే టాక్​ ఉంది. ఆ అధ్యాపకులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు వీలుగా ‘లీగల్ ఒపీనియన్’ (న్యాయ సలహా) తీసుకునే పేరుతో యూనివర్సిటీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే ఆయనకు, వర్సిటీలోని ఇతర వర్గాలకు మధ్య మరింత దూరాన్ని పెంచిందని తెలుస్తోంది.

Telangana University Registrar | సిబ్బందిలో అసంతృప్తి

2024 జూన్ 16వ తేదీ నుంచి రిజిస్ట్రార్​గా యాదగిరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో యాదగిరి పరిపాలనపై పూర్తిగా పట్టు కోల్పోయారనే అపవాదు మూటగట్టుకున్నారు. గతంలో చురుగ్గా వ్యవహరించిన ఆయన, ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ పరిపాలనా వ్యవహారాలను, విద్యార్థులు, సిబ్బంది సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు తీవ్రమయ్యాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు కింది స్థాయి సిబ్బందిని రిజిస్ట్రార్ యాదగిరి చాలా చులకనగా చూస్తున్నారని సదరు ఉద్యోగులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తమ సమస్యలను చెప్పుకుందామని వెళ్తే కనీసం గౌరవం ఇవ్వడం లేదని, దీనివల్ల సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి నెలకొందని సమాచారం.

Telangana University Registrar | మార్పుపై గతంలోనే ఉహాగానాలు

రిజిస్ట్రార్​ మార్పుపై గతంలోనే ఊహగానాలు వచ్చాయి. పరిపాలనా లోపాలు, సిబ్బంది పట్ల ప్రవర్తన కారణంతో పాటు ప్రధానంగా 2014 ఏడాది నియామక అధ్యాపకుల అంశం నేపథ్యంలో రిజిస్ట్రార్​ను తక్షణమే తొలగించాలనే డిమాండ్​ కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది. ప్రస్తుత రిజిస్ట్రార్​ను తొలగించి కాకతీయ వర్సిటీ నుంచి ప్రొఫెసర్​ను ఇక్కడికి రిజిస్ట్రార్​గా తీసుకొచ్చేందుకు వర్సిటీ వీసీ ప్రయత్నించారని సమాచారం. అయితే రాష్ట్రస్థాయిలో అత్యున్నత పదవిలో ఉన్న జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతతో వీసీపై ఒత్తిడి తీసుకొచ్చి రిజిస్ట్రార్​ తన స్థానికి భద్రపర్చుకున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే రిజిస్ట్రార్ పదవికి యాదగిరి రాజీనామా చేసిన విషయం వాస్తవమేనని, కానీ తాను ఆ రాజీనామాను ఆమోదించలేదని వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు ‘అక్షరటుడే’తో తెలిపారు.

Telangana University Registrar | తక్షణ ప్రత్యామ్నాయం లేకపోవడమేనా..

రిజిస్ట్రార్ పదవికి యాదగిరి రాజీనామాను ఇచ్చినప్పటికీ వీసీ ఆమోదించకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుందని యూనివర్సిటీ చర్చ నడుస్తోంది. యూనివర్సిటీ ఇప్పటికే పలు వివాదాలు నడుస్తుండటంతో, ఇప్పుడు రిజిస్ట్రార్ రాజీనామాను ఆమోదిస్తే పరిపాలన మరింత స్తంభించిపోయే ప్రమాదం ఉందని, 2014 ఏడాదిలో నియామకమైన అధ్యాపకులకు ప్రమోషన్లు ఇవ్వాలనే తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నందున.. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి స్పష్టత రాకుండా యాదగిరి రాజీనామాను ఆమోదిస్తే, అది భవిష్యత్తులో మరిన్ని చట్టపరమైన ఇబ్బందులకు దారితీయవచ్చని.? వీసీ భావిస్తున్నారా.? అనే సందేహం వ్యక్తమవుతోంది.

రిజిస్ట్రార్‌ పదవి కోసం పైరవీలు ముమ్మరం

యాదగిరి రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేయడంతో.. ఆ పదవి కోసం యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్లు పైరవీలు ముమ్మరం చేశారు. రిజిస్ట్రార్ పదవిపై చాలా ఏళ్లుగా ఓ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్ కన్నేశారు. అధికార పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఆచార్యుడు రిజిస్ట్రార్ పదవి ఛేజించుకోవాలని తహతహతో ఉన్నారు. వీరిద్దరిని కాకుండా ఓ మహిళా ప్రొఫెసర్​కు రిజిస్ట్రార్ పదవి ఇస్తే ఎలా.. ఉంటుందని వీసీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

 వర్సిటీ అభివృద్ధి కోసం రిజిస్ట్రార్​గా కొనసాగాలి

తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రిజిస్ట్రార్​గా కొనసాగాలని యాదగిరికి వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు సూచించారు. యూనివర్సిటీలో బుధవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య వచ్చిన సందర్భంలో ఓ ప్రొఫెసర్ తన సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో వీసీ ఛాంబర్​లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరిని ఎంతకాలం రిజిస్ట్రార్ విధుల్లో కొనసాగుతారని ప్రశ్నించడంతో.. సాయంత్రం రిజిస్ట్రార్ పదవికి యాదగిరి రాజీనామా చేసి వీసీ ఛాంబర్​లో అందించారు. దీంతో గురువారం ఉదయం యాదగిరిని, వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు తన ఛాంబర్​లోకి పిలిపించుకున్నారు. రాజీనామాను ఆమోదించలేదని యూనివర్సిటీ అభివృద్ధి కోసం, పరిపాలనా పారదర్శకంగా, సాఫీగా సాగడానికి రిజిస్ట్రార్​గా కొనసాగాలని  వీసీ కోరారు. వీసీ కోరిక మేరకు యాదగిరి తన రాజీనామాను ఉపసంహరించుకుని రిజిస్ట్రార్​గా విధుల్లో కొనసాగుతున్నారు.

Telangana University Courses

ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ సౌత్ ఐలాండ్‌లో 5.6 తీవ్రతతో కూడిన బలమైన భూకంపం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *