అక్షరటుడే వెబ్‌డెస్క్: Gadal Srinivasa Rao | తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. గడల శ్రీనివాసరావుకు పవన్ కల్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణలో జనసేన పార్టీ మళ్లీ యాక్టివ్ కాబోతోందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ నిన్ననే ప్రకటించగా.. మరుసటి రోజే ఈ కీలక చేరిక జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Gadal Srinivasa Rao | గడల రాక పార్టీకి అదనపు బలం..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమకు ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉందన్నారు. ఒక నిజాయతీ గల, ప్రజాసేవ పట్ల అంకితభావం ఉన్న అధికారిగా శ్రీనివాసరావుకు సమాజంలో మంచి గుర్తింపు ఉందని కొనియాడారు. ఆయనలాంటి పరిపాలనా అనుభవం, సేవాభావం ఉన్న వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి అదనపు బలాన్ని, విశ్వసనీయతను ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు, బలోపేతానికి ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Gadal Srinivasa Rao | సమాజానికి విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో..
గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి ద్వారానే పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని గుర్తు చేసుకున్నారు. తాను జనసేనలో చేరడం అనేది ఏదో ఆవేశంలోనో, భావోద్వేగంతోనో తీసుకున్న నిర్ణయం కాదని.. సమాజానికి మరింత విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. నేటి తరానికి పవన్ కల్యాణ్ లాంటి విలువలున్న నాయకత్వం అవసరమని, ఇకపై ఒక జనసైనికుడిగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.

Gadal Srinivasa Rao | బీఆర్ఎస్‌లో దక్కని చాన్స్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలో హెల్త్ డైరెక్టర్‌గా పనిచేసిన గడల శ్రీనివాసరావు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన స్వంత ‘జీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుండి బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు నిరాశే ఎదురైంది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆయన తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) చేశారు.
కొంతకాలం సైలెంట్‌గా ఉన్న గడల.. ఇప్పుడు అనూహ్యంగా జనసేన కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆంధ్రా మూలాలున్న ఓటర్లతో పాటు, పవన్ కల్యాణ్ అభిమానులు, యువత ఎక్కువగా ఉండటంతో.. తన రాజకీయ భవిష్యత్తుకు జనసేన కరెక్ట్ వేదిక అవుతుందనే లెక్కలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామంటున్న పవన్ కల్యాణ్‌కు, గడల శ్రీనివాసరావు రాక ఏ మేరకు కలిసివస్తుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Dalit Tribal Journalists | దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణే లక్ష్యం : కాదేపురం గంగన్న
