Ebola Virus Alert | ఎబోలా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ

ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్​ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ebola Virus Alert | కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Raja Narasimha) సోమవారం సమీక్ష చేశారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో అమలులో ఉన్న స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి, గాంధీ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఇద్దరు అనుమానితులను గాంధీలో ఐసోలేషన్‌లో ఉంచి, వారి సాంపిల్స్‌ను టెస్టుల కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా.. అక్కడ చేసిన టెస్టుల్లో వారి ఇద్దరికీ వైరస్ నెగిటివ్‌ వచ్చిందని మంత్రికి వివరించారు.

Ebola Virus Alert | అలసత్వం వహించొద్దు

అనుమానిత సాంపిల్స్‌ సేకరణ, టెస్టులు చేయడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని మంత్రి సూచించారు. ఆరోగ్యశాఖకు అవసరమైన సహకారం అందించాలని సీసీఎంబీ (CCMB) డైరెక్టర్‌‌ను మంత్రి కోరారు. ఐసీఎంఆర్ నుంచి ఎబోలా టెస్టింగ్ కిట్లు వచ్చాయని, టెస్టులు చేయడం ప్రారంభించామని సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. ఎబోల ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను కచ్చితంగా, సక్రమంగా అందించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ సహా వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Ebola Virus Alert | ఆందోళన చెందొద్దు

రాష్ట్రంలో ఎబోలా వ్యాధి నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *