అక్షరటుడే వెబ్‌డెస్క్: Ride Hailing GST | రోజువారీ రవాణా కోసం మనం ఆశ్రయించే ఆటోలు, క్యాబ్‌ల యాప్స్ (రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్స్) త్వరలో మరింత ప్రియం కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. సబ్‌స్క్రిప్షన్ ఆధారిత యాప్స్‌పై జీఎస్టీ( GST ) నిబంధనలను కఠినతరం చేస్తే డ్రైవర్ల ఉపాధి దెబ్బతినడమే కాకుండా, ప్రయాణికులపై అదనపు భారం పడనుందని ‘ఇస్యా సెంటర్’ (Esya Centre) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది.
Ride Hailing GST | ఏమిటీ సబ్‌స్క్రిప్షన్ మోడల్?
ప్రస్తుతం నడుస్తున్న చాలా యాప్స్ ‘సబ్‌స్క్రిప్షన్’ పద్ధతిలో పనిచేస్తున్నాయి. ఇందులో డ్రైవర్లు యాప్‌ని వాడుకున్నందుకు గానూ కంపెనీకి ఒక నిర్ణీత రుసుము (Subscription Fee) చెల్లిస్తారు. రైడ్ ధరలను నిర్ణయించడం, డబ్బులు వసూలు చేసుకోవడం వంటి విషయాల్లో డ్రైవర్లకే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదించిన సీజీఎస్టీ చట్టంలోని ‘సెక్షన్ 9(5)’ నిబంధన ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌లపై కూడా జీఎస్టీ భారాన్ని మోపాలనే ప్రతిపాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Ride Hailing GST | ఆచరణలో కష్టాలు..
ఈ నివేదిక ప్రకారం, ఈ ప్రతిపాదిత విధానం ఆచరణలో అమలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే, డ్రైవర్లు స్వతంత్రంగా సేవలు అందిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిధిలోకి రారు. వివిధ రాష్ట్రాల్లోని అథారిటీలు ఇస్తున్న పరస్పర విరుద్ధమైన తీర్పుల వల్ల కంపెనీల మధ్య సమాన పోటీ వాతావరణం దెబ్బతింటోంది. ఒకవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంటే, పన్నుల వివరణలు మాత్రం పాత పద్ధతిలోనే ఉండటం వల్ల గందరగోళం నెలకొంది.

Ride Hailing GST | డ్రైవర్ల ఆదాయానికి గండి..
ఈ నిబంధనల వల్ల డ్రైవర్లు తమ జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని 13 నగరాల్లో జరిగిన సర్వేలో తేలింది. కొత్త పన్ను విధానం వల్ల తమ నికర ఆదాయం తగ్గిపోతుందని 80 శాతం మంది డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్స్ తగ్గిపోతాయని 60 శాతం మంది డ్రైవర్లు భావిస్తున్నారు. పన్ను భారం భరించలేక దాదాపు 50 శాతానికి పైగా డ్రైవర్లు యాప్స్ వాడకాన్ని తగ్గించి, నేరుగా కస్టమర్లను పట్టుకునే ‘ఆఫ్‌లైన్’ లేదా ‘ఇన్‌ఫార్మల్’ రైడ్స్ వైపు మళ్లుతామని స్పష్టం చేశారు.
Ride Hailing GST | పెరగనున్న ఆర్థిక భారం..
ధరలు పెరిగితే సామాన్యులు ప్రయాణాలను తగ్గించుకునే అవకాశం ఉంది. రైడ్ ఛార్జీలు కేవలం 5 శాతం పెరిగినా, తమ ప్రయాణాలను తగ్గించుకుంటామని 68 శాతం మంది వినియోగదారులు స్పష్టం చేశారు. ధరలు పెరిగితే యాప్స్ కంటే పాత తరహా సాధారణ టాక్సీలనే ఆశ్రయించడానికి 50 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. ప్లాట్‌ఫారమ్స్ ద్వారా ప్రయాణించడం వల్ల లభించే భద్రతా ఫీచర్లు (Safety Features) తమకు చాలా ముఖ్యమని, యాప్స్ వాడకం తగ్గితే భద్రత కరువవుతుందని 90 శాతం మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
Ride Hailing GST | ఇస్యా సెంటర్ సిఫార్సు..
“ప్లాట్‌ఫారమ్‌లకు రైడ్ ధరలను నిర్ణయించే లేదా ఛార్జీలను వసూలు చేసే నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే సెక్షన్ 9(5) కింద జీఎస్టీ వర్తించేలా స్పష్టత ఇవ్వాలి” అని ఇస్యా సెంటర్ డిమాండ్ చేస్తోంది. భద్రత, వెరిఫికేషన్ వంటి పనులను పన్ను ప్రయోజనాల కోసం లావాదేవీలపై నియంత్రణగా పరిగణించకూడదని సూచించింది. టెక్నాలజీ వల్ల మొబిలిటీ రంగం వేగంగా మారుతోంది. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూనే, డ్రైవర్ల ఉపాధిని, సామాన్యుల భద్రతను కాపాడేలా ప్రభుత్వం విధానాలను రూపొందించాలని నిపుణులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజెక్ట్
