అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jupally Krishna Rao | గంజాయి, మద్యం అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అక్రమార్కులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
హైదరాబాద్ బండ్లగూడ జాగీర్‌లోని ఎక్సైజ్ అకాడమీలో అసిస్టెంట్ సూపరింటెండెంట్స్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్) కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఆరు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది అధికారులను అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు పురస్కారాలు ప్రదానం చేశారు.
Jupally Krishna Rao | 33 మంది మహిళా అధికారులు
ఎక్సైజ్ శాఖ (Excise Department) లో మహిళల భాగస్వామ్యం పెరగడం మహిళా సాధికారతకు నిదర్శనమని మంత్రి అన్నారు. 117 మందిలో 33 మంది మహిళా అధికారులు ఉన్నారని తెలిపారు. 24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లకు శిక్షణ అందించినట్లు వెల్లడించారు. శిక్షణతో చట్టాలపై అవగాహన, విచారణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, అసలు పరీక్ష క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలోనే మొదలవుతుందని పేర్కొన్నారు.
Jupally Krishna Rao | ఉక్కుపాదం మోపాలి

యూనిఫాం హోదాకు కాదు.. ప్రజల విశ్వాసానికి ప్రతీక అని జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయ శాఖ కాదని, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక విభాగమన్నారు. డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడే బాధ్యత అధికారులపై ఉందన్నారు. తెలంగాణలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్తీ కల్లు, సింథటిక్ డ్రగ్స్, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లు కొత్త ముప్పుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై ప్రత్యేక నిఘా అవసరమని తెలిపారు. మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Khammam Theft | ఖమ్మంలో భారీ చోరీ.. రూ.2 కోట్ల విలువైన ఫోన్లు ఎత్తుకెళ్లిన దొంగలు
