అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghava Lawrence Politics | తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానం నుంచి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తరపున ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ( Raghava Lawrence )పోటీ చేస్తారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో, తన రాజకీయ అరంగేట్రంపై లారెన్స్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీసింది.
Raghava Lawrence Politics | రాజకీయాల వైపు అడుగులు ..
సోషల్ మీడియా వేదికగా లారెన్స్ ఒక వీడియోను విడుదల చేస్తూ తన మనసులోని మాటను పంచుకున్నారు. “నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించాలనో, అధికారం దక్కించుకోవాలనో నాకు ఎప్పుడూ ఆశ లేదు. నాకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, వారికి మద్దతుగా ఉంటూ సామాజిక సేవను మరింత విస్తృతం చేయాలనుకున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితులు నన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయి” అని లారెన్స్ పేర్కొన్నారు.

Raghava Lawrence Politics | ప్రజల నిర్ణయమే నా ఫైనల్ డెసిషన్..
తన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, తన తల్లి అభిప్రాయాలు , తనను ప్రభావితం చేసిన ఘటనల గురించి ఆ వీడియోలో లారెన్స్ వివరంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాజకీయాల్లోకి రావద్దని భావిస్తే, తాను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని, యధావిధిగా నిస్వార్థ సేవలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలందరూ రాజకీయాల్లోకి రావాలని ఆశీర్వదిస్తే, అందరి సహకారంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
Raghava Lawrence Politics | కామెంట్ల రూపంలో తెలపాలని..
తన నిర్ణయంపై ప్రజలు, అభిమానులు తమ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలపాలని ఆయన కోరారు. లారెన్స్ చేసిన ఈ సంచలన ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Weather | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
