Canada Visa Scam | నకిలీ కాల్స్‌తో మోసాలు.. కెనడాలోని భారతీయులకు కీలక అడ్వైజరీ

కెనడాలో చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Canada Visa Scam | కెనడాలో చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయ పౌరులను, ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు ( Cyber Fraud ) సరికొత్త మోసాలకు తెరలేపారు. కెనడాలోని భారత కాన్సులేట్ జనరల్ అధికారులమని నమ్మిస్తూ, అమాయకులను బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. ఈ ముఠా అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ, బాధితులను నిలువునా మోసం చేస్తోంది.

Canada Visa Scam | టెక్నాలజీతో బురిడీ..

ఈ కేటుగాళ్లు ‘కాలర్ ఐడీ స్పూఫింగ్’ అనే టెక్నాలజీని వాడుతున్నారు. దీనివల్ల బాధితుల ఫోన్లలో భారత రాయబార కార్యాలయానికి చెందిన అసలైన నంబర్లు కనిపిస్తాయి. దీంతో బాధితులు అవతలి వ్యక్తులను నిజమైన అధికారులని నమ్మి, వారు చెప్పేదంతా నిజమని భావిస్తారు. ఫోన్ ఎత్తగానే మీ వీసా దరఖాస్తుల్లో లోపాలు ఉన్నాయని, పత్రాలు నకిలీవని భయపెట్టి, వెంటనే జరిమానాలు కట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Canada Visa Scam | డబ్బుల వసూలు..

సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, తక్షణమే ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు. డబ్బులు కట్టకపోతే తక్షణమే దేశం నుంచి డిపోర్ట్ చేస్తామని లేదా జైలుకు పంపుతామని బెదిరిస్తూ తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ వరుస మోసాలతో భారతీయ పౌరులు ఆందోళన చెందుతున్నారు.

Canada Visa Scam | భారత కాన్సులేట్ హెచ్చరిక..

ఈ వ్యవహారంపై భారత కాన్సులేట్ జనరల్ స్పందిస్తూ ‘ఎక్స్’ వేదికగా కీలక అడ్వైజరీ జారీ చేసింది. కాన్సులేట్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ల ద్వారా డబ్బులు అడగబోరని, ఎవరినీ బ్యాంకింగ్ వివరాలు లేదా ఓటీపీలు అడగమని స్పష్టం చేశారు. ఫోన్ స్క్రీన్‌పై కాన్సులేట్ నంబర్ కనిపించినప్పటికీ, డబ్బుల గురించి ప్రస్తావిస్తే వెంటనే ఫోన్ కట్ చేయాలని సూచించారు.

Canada Visa Scam | పోలీసులకు ఫిర్యాదు ..

మోసపూరిత కాల్స్ వస్తే భయపడి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులు కోరారు. ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే స్థానిక కెనడియన్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే, ఈ విషయాలను భారత కాన్సులేట్‌కు తెలియజేసి అప్రమత్తంగా ఉండాలని పౌరులకు గట్టిగా హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Ponguleti Srinivasa Reddy | ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *