అక్షరటుడే, వెబ్‌డెస్క్: Anganwadi Centers | బాల్యంలో విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలను సమగ్రంగా అందిస్తూ చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రతి చిన్నారి అంగన్‌వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.హైదరాబాద్ (Hyderabad) జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తో కలిసి చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు.
Anganwadi Centers | చిన్నారులకు అక్షరాభాస్యం
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు మంత్రి సీతక్క (Minister Seethakka) అక్షరాభ్యాసం చేయించారు. అభ్యాసన పుస్తకాలు, ఆటవస్తువులను అందించారు. కేంద్రంలో అందుతున్న ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు. అంగన్‌వాడీల ద్వారా లభించే సేవలపై తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని తమ పిల్లలను కేంద్రాల్లో నమోదు చేయించాలని సూచించారు. అంగన్‌వాడీలను కేవలం పోషకాహార కేంద్రాలుగానే కాకుండా చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
Anganwadi Centers | బ్రేక్‌ఫాస్ట్ పథకం

భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి మంచి స్పందన రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులకు పోషకాహారం అందించేందుకు 57 రకాల విద్యా, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. నర్సరీ విద్య పూర్తి చేసిన చిన్నారులకు ప్రత్యేక సర్టిఫికెట్లు కూడా అందిస్తామన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.
Anganwadi Centers | అంగన్వాడీలకు పంపాలి
పిల్లలను లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే బదులు అంగన్‌వాడీల్లో చేర్పించాలని మంత్రి సూచించారు. అత్యుత్తమ వాతావరణంలో వారిని తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయగల సామర్థ్యం అంగన్‌వాడీ వ్యవస్థకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అనిత రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kalvakuntla Kavitha Remarks | సింగరేణి గడ్డపై త్వరలో మా జెండాను రెపరెపలాడిస్తాం: కవిత