Conductor Death | చికిత్స పొందుతూ మహిళా కండక్టర్​ మృతి

ప్రయాణికురాలు నెట్టేయడంతో బస్సులో నుంచి కిందపడ్డ మహిళా కండక్టర్​ చికిత్స పొందుతూ మృతి చెందింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Conductor Death | ప్రయాణికురాలు నెట్టేయడంతో బస్సులో నుంచి కిందపడ్డ మహిళా కండక్టర్​ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆర్టీసీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) మణుగూరు డిపోకు చెందిన కండక్టర్​ గుండ్ల ప్రవళికను అక్టోబర్​ 25న ఓ ప్రయాణికురాలు కదులుతున్న బస్సులో నుంచి తోసేసింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఎక్కింది. ఆ బాలుడికి టికెట్ తీసుకుంది. దీని కోసం ఆమె రూ.100 ఇవ్వగా.. కండక్టర్​ టికెట్​ ఇచ్చి, చిల్లర లేవని టికెట్​ వెనకాల రాశారు. చిల్లర డబ్బులు దిగే సమయంలో తీసుకోవాలని సూచించారు. తనకు వెంటనే చిల్లర ఇవ్వాలని సదరు మహిళా కోరింది. ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ కండక్టర్​ ప్రవళికను కిందకూ తోసేసింది.

Conductor Death | కాళ్లపై నుంచి టైర్లు వెళ్లడంతో..

కింద పడ్డ కండక్టర్​ ప్రవళిక రెండు కాళ్లపై నుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లాయి. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. పది రోజులుగా సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం రాత్రి చనిపోయారు. ఇప్పటికే పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Conductor Death | మంత్రి దిగ్భ్రాంతి

ప్రవళిక మృతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం, ఆర్టీసీ బాధిత కుటుంబానికి అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా కండక్టర్​ మృతిపై ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఖమ్మం రీజియన్​ పరిధిలో బస్సులు బంద్​ చేసి నిరసన తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి..: Weather Update | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *